లాక్ డౌన్ ఎఫెక్ట్.. బైక్ పై ఒక్కరు కార్లో ఇద్దరే

లాక్ డౌన్ ఎఫెక్ట్.. బైక్ పై ఒక్కరు కార్లో ఇద్దరే

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ విస్తరించకుండా రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తామని సీఎస్​ సోమేశ్​కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎపిడెమిక్ డిసీజెస్​ యాక్ట్ 1897 ప్రకారం 31వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని.. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. చాలా మంది అవసరం లేకున్నా వాహనాలతో రోడ్ల మీదికి వస్తున్నారని, అలా చేస్తే వెహికల్స్​ను సీజ్ చేస్తామని, సదరు వ్యక్తులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐదుగురికి మించి గ్రూప్​గా తిరగవద్దని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కిరాణా, మెడికల్స్, పెట్రోల్​ బంకులు వంటివి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ బయటికి రావొద్దని చెప్పారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం త్వరలోనే 12 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేయనుందని, ఒక్కో కార్డుకు రూ.1,500 చొప్పున ఇవ్వనున్నారని తెలిపారు.అత్యవసర పనుల కోసం బయటికొచ్చే వారు టూ వీలర్ పై ఒక్కరే రావాలని, కార్లలో కూడా ఇద్దరే ఉండాలని సీఎస్  చెప్పారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించిందని.. ఎమర్జెన్సీ శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం డ్యూటీలకు హాజరుకావాలని తెలిపారు. వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులు చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు

లాక్  డౌన్  నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కు చెందిన వెహికల్స్ కాకుండా సాధారణ వాహనాలు బయటికి రావొద్దని చెప్పారు. ‘‘లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత చాలా మంది తమ వాహనాల్లో బయటికి వస్తున్నారు. దాని వల్ల కరోనా వైరస్ విస్తరించే ప్రమాదం ఉంది. వైరస్​ నియంత్రణ చర్యలు ఫలితం ఇవ్వవు. అందుకని లాక్  డౌన్ కఠినంగా అమలు చేస్తం. సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరూ బయటికి రావొద్దు. వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటం’’ అని హెచ్చరించారు.

నిత్యావసరాల ధరలు పెంచొద్దు

నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టమొచ్చినట్టు పెంచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్, డీజీపీ హెచ్చరించారు. నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు సరుకుల  పంపిణీ  కోసం ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.