యువకుడి ప్రాణం తీసిన  రెండు గ్రామాల వివాదం

యువకుడి ప్రాణం తీసిన  రెండు గ్రామాల వివాదం
  • తూము తెరిచేందుకు వెళ్లి చెరువులో పడి మృతి

వికారాబాద్,వెలుగు: రెండు గ్రామాల మధ్య చెరువు వివాదం యువకుడి ప్రాణం తీసింది. తూము తెరిచేందుకు వెళ్లిన యువకుడు చెరువులో పడి గల్లంతైన ఘటన  కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ లో జరిగింది. మండలంలోని పుట్టపహాడ్, గాదిర్యాల గ్రామాల పరిధిలో ఓచెరువు ఉంది. రెండు గ్రామాల మధ్య చెరువు విషయంలో కొన్నేండ్లుగా వివాదం నడుస్తోంది.  గతంలో చెరువుకు ఉన్న రెండు తూముల ద్వారా ఇరు గ్రామాల రైతులు తమ పొలాలకు నీళ్లు వాడుకునేవారు. చెరువు నీళ్లు, చేపల విషయంలో రెండు గ్రామాల మధ్య గొడవలు కొంతకాలంగా ఎక్కువయ్యాయి. మంగళవారం గాదిర్యాలకు  చెందిన కొందరు వ్యక్తులు తూము తెరిచే సామగ్రిని తమ దగ్గరే పెట్టుకుని పుట్టపహాడ్ గ్రామస్తులను ఇబ్బంది పెట్టారు. సామగ్రిని ఎలా ఇవ్వరనే ఆవేశంతో పుట్టపహాడ్ గ్రామానికి చెందిన మల్లేశ్​తూము తెరిచేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ విఠల్ రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ మల్లేశ్​డెడ్ బాడీని చెరువులో నుంచి బయటికి తీయించి మహబూబ్ నగర్ హాస్పిటల్ కి తరలించారు. గాదిర్యాలకు చెందిన వ్యక్తులే మల్లేశ్ పై దాడి చేసి చెరువులో పడేసి ఉంటారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని పుట్టపహాడ్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.