విద్యుత్‌‌‌‌ సౌధలో ఉద్యోగుల మహాధర్నా

విద్యుత్‌‌‌‌ సౌధలో ఉద్యోగుల మహాధర్నా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్రం ప్రతిపాదిస్తున్న కొత్త విద్యుత్ బిల్లుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌‌‌‌లోని విద్యుత్‌‌‌‌ సౌధ, మింట్‌‌‌‌కాంపౌండ్‌‌‌‌, వరంగల్‌‌‌‌లోని ఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌తో పాటు జిల్లా కేంద్రాల్లో విద్యుత్‌‌‌‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి నల్లచొక్కాలు ధరించి పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలు, పలు జేఏసీలు నిర్వహించినకార్యక్రమాలకు వివిధ పార్టీ నేతలతో పాటు ట్రాన్స్‌‌‌‌కో సీఎండీ మద్దతు తెలిపారు. సబ్‌‌‌‌ స్టేషన్లు, పవర్ జనరేటింగ్‌‌‌‌ స్టేషన్లలోని అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగులు విధుల్లో కొనసాగారు. అయితే పెద్దగా విద్యుత్‌‌‌‌ అవాంతరాలు లేకపోవడంతో వినియోగదారులకు ఇబ్బంది తప్పింది. దేశ వ్యాప్తంగా 50 వేల మంది విద్యుత్‌‌‌‌ ఉద్యోగుల ఐక్య పోరాట ఫలితంగా కేంద్రం స్టాండింగ్‌‌‌‌ కమిటీ పరిశీలనకు పంపించిందని, ఇది ఉద్యోగుల విజయమని జాక్‌‌‌‌ నేతలుపేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంతో వెనక్కి తగ్గామని లేకపోతే దేశం అంధకారం అయ్యేదన్నారు. బిల్లుపై కమిటీ నిర్ణయాలను ఎప్పటికప్పుడు గమనిస్తామన్నారు. విద్యుత్‌‌‌‌ సంస్థల మనుగడ, ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడితే, బిల్లు మళ్లీ పార్లమెంట్‌‌‌‌కు వస్తే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

టీఈఈ రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ 

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌‌‌‌ (టీఈఈ) జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశంలో విద్యుత్​బిల్లుకు వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. సోమాజిగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో టీఈఈ జేఏసీ అధ్యక్షుడు పి ప్రకాశ్, కన్వీనర్‌‌‌‌ శివాజీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టీజాక్‌‌‌‌ చేపట్టబోయే ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములం అవుతామని కాంగ్రెస్‌‌‌‌, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ పార్టీల ప్రతినిధులు ప్రకటించారు. సమావేశంలో  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, కిసాన్‌‌‌‌ సెల్‌‌‌‌ నేత కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మింట్​ కాంపౌండ్‌‌‌‌లో నిరసనలు

విద్యుత్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు, అధికారులు నాయకులు మహాధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ కేంద్రం తెస్తున్న విద్యుత్‌‌‌‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. డిస్కంలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 

విద్యుత్ ఉద్యోగుల ఫోరమ్ నిరసనలు

విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల ఫోరమ్ (టీఎస్‌‌‌‌ఈఈఎఫ్‌‌‌‌) ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్రలను వ్యతిరేకిస్తామని, ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని ఫోరమ్ ప్రతినిధులు మల్లేశం, శ్రీనివాస్ పేర్కొన్నారు.

విద్యుత్‌‌‌‌ సౌధలో మహాధర్నా

పవర్‌‌‌‌ ఇంజనీర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో విద్యుత్‌‌‌‌సౌధలో నిర్వహించిన మహాధర్నాకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఇంజనీర్లు తరలివచ్చారు. నల్ల షర్ట్‌‌‌‌ లు ధరించి, ‘‘సేవ్‌‌‌‌ పవర్‌‌‌‌..సేవ్‌‌‌‌ ఇండియా” అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాకు ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌‌‌‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలకు విద్యుత్ రంగంపై హక్కు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో పవర్‌‌‌‌ ఇంజినీర్స్‌‌‌‌ జేఏసీ చైర్మన్‌‌‌‌ సాయిబాబు, కన్వీనర్‌‌‌‌ రత్నకార్‌‌‌‌రావు పాల్గొన్నారు.