
బషీర్బాగ్, వెలుగు: కోఠి ఈఎన్టీ దవాఖాన కంపుకొడుతోంది. ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగాంచిన చెవి, గొంతు, ముక్కు (ఈఎన్టీ) దవాఖానలో ముక్కు మూసుకుని చికిత్సలు చేయించుకునే దుస్థితి ఏర్పడింది. హాస్పిటల్ ప్రాంగణంలో మురుగు ఏరులై ప్రవాహిస్తుండడంతో రోగులు, వైద్య సిబ్బంది ముక్కుపుటాలు అదురుతున్నాయి. అత్యవసరంగా ఈఎన్టీ దవాఖానలో క్యాజువాల్టీకి వచ్చే రోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మురుగు నీటిలోంచే నడుచుకుంటూ వెళ్లి, చికిత్సలు చేయించుకుంటున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లే: సూపరింటెండెంట్
రెండు వారాలుగా హాస్పిటల్ క్యాంటీన్ నుంచి మెయిన్ గేటు, క్యాజువాల్టీ వరకు మురుగు ప్రవహిస్తున్నదని సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ ఆచార్య తెలిపారు. రోగులు ముక్కు మూసుకుని చికిత్స తీసుకోవాల్సిన దయనీయ స్థితి నెలకొనగా, క్యాజువాల్టీకి వచ్చే అత్యవసర రోగులు మురుగు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోందన్నారు. నెల రోజులుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, డీఎంఈలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.