
నల్గొండ , వెలుగు:
హైదరాబాద్, -విజయవాడ 65వ నేషనల్ హైవే మీద వాహనాల రద్దీ పెరిగింది. దసరా సెలవులు ముగియగా రిటర్న్ జర్నీతో హైదరాబాద్ వైపు వాహనాలు బారులు తీరాయి. కార్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఒకదాని వెంట మరొకటి నిలిచిపోయాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్‌లో వాహనాల రాకపోకలు నిదానంగా సాగాయి.
మరోవైపు ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోయాయి. దసరా సెలవులు ముగియడంతో పల్లె నుంచి ప్రజలు పట్నానికి తిరిగి పయనమయ్యారు. బస్టాండ్ల వద్ద బస్సులు నిండుగా ఉండడంతో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉద్యోగులకు దసరా సెలవులతోపాటు వీకెండ్ కూడా కలిసి వచ్చింది.
దీంతో ఆదివారం (అక్టోబర్ 05) నగరానికి చేరుకుని సోమవారం ఆఫీస్‌లకు వెళ్లాలనే ఆలోచనతో అందరూ ఒకేసారి హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. దీంతో నగరానికి వచ్చే అన్ని రహదారులు రద్దీ పెరిగి గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. చిట్యాల, వెలిమినేడు, చౌటుప్పల్ వద్ద రోడ్డు పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ జాం అయింది.