కొనుగోలు సెంటర్లు లేక రైతుల కష్టాలు

కొనుగోలు సెంటర్లు లేక రైతుల కష్టాలు

మిర్యాలగూడలో కొనుగోలు సెంటర్లు లేక
మిల్లులకు క్యూ కట్టిన రైతులు

ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నేరేడుచర్లలో వడ్ల రైతులు రోడ్డెక్కారు. కోతలు జోరందుకొని వారాలు గడుస్తున్నా.. సర్కారు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో వడ్లు అమ్ముకునేందుకు రైతులు ప్రైవేటు మిల్లులకు క్యూ కడుతున్నారు. అక్కడ మిల్లర్లు కూడా ధాన్యం కొనుగోలుకు కొర్రీలు పెడుతుండటంతో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ధాన్యం లోడులను రోడ్డుకు అడ్డుగా పెట్టడంతో మిర్యాలగూడ‑ కోదాడ హైవేపై నేరేడుచర్ల నుంచి చిల్లపల్లి వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
 

మిర్యాలగూడ/నేరేడుచర్ల, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నేరేడుచర్లలో వడ్ల రైతులు రోడ్కెక్కారు. కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నేరేడుచర్లలో ఆందోళన చేయగా.. తడిసిన వడ్లను కొనబోమని మిల్లర్లు కొర్రీలు పెట్టడంతో మిర్యాలగూడలో నిరసనకు దిగారు.  
ధాన్యం తడిసిందని కోత పెడ్తుండటంతో..
మిర్యాలగూడ డివిజన్ లో ఈ వానకాలం ఎక్కువ మంది రైతులు సన్నవడ్లు పండించారు. ఆదివారం అర్ధరాత్రి సడన్​గా వర్షం పడటంతో మిర్యాలగూడ మండలం, దామరచర్ల, వేములపల్లి, అడవిదేవులపల్లి పరిధిలో 3,530 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. ఆయా చోట్ల వడ్లు కూడా తడిశాయి. కోతలు జోరందుకున్నా.. సర్కారు ఇప్పటి వరకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు వేములపల్లి మండలం శెట్టిపాలెం పరిధిలో రెండు ప్రైవేటు మిల్లులు, మిర్యాలగూడ మండలం గూడూరు శివార్లలో గల మిల్లులకు ట్రాక్టర్లలలో ధాన్యం తీసుకువెళ్లారు. సోమవారం కొందరు రైతుల వడ్లు కొనుగోలు చేసిన మిల్లర్లు.. ఆ తర్వాత ఆపేశారు. ఆయా చోట్ల ధాన్యం తడిసిందని, క్వాలిటీ లేదని కొనమని, రెండు కిలోల చొప్పున కోత విధిస్తామని ప్రకటించారు. దీంతో ఆయా మిల్లుల వద్ద రోడ్డుపై ట్రాక్టర్లను అడ్డుపెట్టి ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్​ నిలిచింది. రైతుల ఆందోళనకు డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్​కిసాన్ సెల్​జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బీజేపీ కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల సీతారాంరెడ్డి మద్దతు తెలిపారు. లీడర్ల జోక్యంతో ఆఫీసర్లు మిల్లర్లతో మాట్లాడారు. ధాన్యం తీసుకునేందుకు మిల్లర్లు ఒప్పుకోకపోవడంతో ఆందోళన విరమించారు. మిర్యాలగూడ మిల్లర్లతో ఆర్డీవో రోహిత్​సింగ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు ఇతర ఆఫీసర్లతో మీటింగ్​ఏర్పాటు చేశారు. వడ్లు కొనుగోలు చేయాలని, రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరిస్తే సీజ్ ​చేస్తామన్నారు.   
మూసీ బ్రిడ్జి మీద ట్రాక్టర్లు అడ్డుపెట్టి..
వడ్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల  రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని  చిల్లేపల్లి మూసి బ్రిడ్జి మీద ధాన్యం లోడుతో ఉన్న వాహనాలు నిలిపి  ధర్నా చేశారు. వెంటనే  ఐకేపీసెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా రైతుల వడ్లు మిర్యాలగూడకు తీసుకెళ్లకుండా కొందరు అడ్డుకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డుపెట్టడంతో మిర్యాలగూడ, కోదాడ ప్రధాన రహదారిపై నేరేడుచర్ల నుంచి చిల్లపల్లి వరకు సుమారు5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ విజయ్ ప్రకాష్, ఏవో వీరభద్రరావు రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. సూర్యాపేట జిల్లా రైతుల వడ్లు మిర్యాలగూడకు తీసుకెళ్లకుండా అడ్డుకోవడాన్ని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి తప్పుబట్టారు.అధికార పార్టీ లీడర్లు మిల్లర్లతో కుమ్మక్కై వడ్లు కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.