హైదరాబాద్ లో రెయిన్ అలర్ట్..మరో 12 గంటలు జాగ్రత్త

హైదరాబాద్ లో రెయిన్ అలర్ట్..మరో 12 గంటలు జాగ్రత్త

ఐదురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. నగరవ్యాప్తంగా రాబోయే 12 గంటల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇవాళ రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు బలమైన గాలులు వీస్తాయని , చెట్లు కూలే అవకాశం ఉందని తెలిపింది. చెట్ల కింద ఎవరూ ఉండొద్దని వార్నింగ్ ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎమర్జెన్సీ కోసం NDRF బృందాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ముంపు ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు. 

మరో రెండు, మూడు రోజులపాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరెంట్ పోల్స్ దగ్గర, చెట్ల కింద, నాలాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరు నిలబడవద్దని నగరవాసులను జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని నగర మేయర్ విజయలక్ష్మి తెలిపారు. వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద చేరుతోంది.హుస్సేన్ సాగర్ ఎఫ్ టి ఎల్ లెవెల్ 513.41 అడుగులు కాగా ప్రస్తుతం 513.45 అడుగులుగా ఉంది. హుస్సేన్ సాగర్ కు గతంలో ఏర్పాటు చేసిన గేటు ఓపెన్ చేసి అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు.