భద్రాచలం రామయ్యకు పైసా ఇయ్యని సర్కార్

భద్రాచలం రామయ్యకు పైసా ఇయ్యని సర్కార్
  • భద్రాచలం రామయ్య పట్టుబట్టలకు పైసా ఇయ్యని సర్కార్
  • ఆలయ సొమ్ముతోనే పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాల కొనుగోలు
  • తిరిగి చెల్లిస్తమని జీవోలు ఇచ్చుడే తప్ప చెల్లించింది లేదు

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున పెట్టే పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలకు రాష్ట్ర సర్కారు పైసలు ఇస్తలేదు. వేడుకలకు సీఎంగానీ, దేవాదాయ శాఖ మంత్రిగానీ మేళతాళాల మధ్య నెత్తిన పెట్టుకొని తెచ్చే వీటిని దేవాలయం సొమ్ముతోనే కొంటున్నరు. 
కానీ, ప్రభుత్వమే సమర్పిస్తున్నట్లు  చెప్పుకుంటున్నరు. ఇందుకోసం కనీసం పది రూపాయలు కూడా ఆలయ అకౌంట్​లో సర్కారు జమచేస్తలేదు. ఏటా ఆలయ అధికారులు ప్రపోజల్స్​ పంపడం, ప్రభుత్వం పక్కనపడేయడం పరిపాటిగా మారింది. పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చే సంప్రదాయం తానీషా కాలం నుంచి వస్తున్నది. అయితే.. తెలంగాణ ఏర్పడిననాటి నుంచి రాష్ట్ర సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదు. 

ఏడేండ్లుగా రూపాయి కూడా రాలె
ఏప్రిల్​ 10న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు జరుగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దేశంలో మరెక్కడా లేని విశిష్టమైన సంప్రదాయం భద్రాచలంలో జరిగే వేడుకలకు ఉన్నది.  ఏటా సీతారాముల కల్యాణానికి తానీషా కాలం నుంచే  ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సర్కారే కొని పంపాలనే శాసనం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. సీతారాముల కల్యాణానికి నాటి సర్కారు లాంఛనంగా 9 ముత్యాలు, పట్టు వస్త్రాలు కొనుగోలుకు మొదట్లో రూ. 5 వేలు, ఆ తర్వాత రూ. 15 వేల చొప్పున చెల్లిస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించి జీవో రాగానే భద్రాద్రి ఆలయ అధికారులు ప్రభుత్వం పేరిట ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు కొనుగోలుచేసేవారు. సర్కారు నుంచి డబ్బులు రిలీజ్​ కాగానే సొమ్ము స్వామివారి అకౌంట్​లో పడేది.  కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక  2014 నుంచి జీవోలు తప్ప ప్రభుత్వం నుంచి పైసా రావడం లేదు. ప్రస్తుతం సీతారాములకు సమర్పించే పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు లక్షదాకా ఖర్చవుతున్నది. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 15 వేల జీవోను నేటికీ సవరించిన పాపాన పోలేదు. ఏడేండ్ల నుంచి తలంబ్రాలు, పట్టువస్త్రాలకు సంబంధించి సర్కారు నుంచి పది పైసలు కూడా రాములోరి అకౌంట్​లో పడలేదు. 

సీఎం కూడా రావట్లే.. 
సీతారాముల కల్యాణానికి స్వయంగా పాలకులే పట్టుబట్టలు, తలంబ్రాలు తీసుకెళ్లాలని తానీషా కాలం నాటి శాసనంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలు దాదాపు ఈ సంప్రదాయాన్ని పాటించారు. కానీ సీఎం కేసీఆర్​ ఈ నిబంధనను పక్కనపడేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో ఒకసారి మాత్రమే సీఎం హోదాలో కేసీఆర్ సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు తెచ్చారు. ఆతర్వాత 2016లో తన మనుమడు హిమాన్షుతో పట్టువస్త్రాలు సమర్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. 2015 తర్వాత సీఎం కేసీఆర్​ ఇప్పటివరకు శ్రీరామనవమికి భద్రాద్రి రాలేదు. 2015లో ఆయన సమర్పించిన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకూ సర్కారు నుంచి పైసలు రాలేదు. పట్టువస్త్రాలకు పైసలు ఇవ్వని విషయాన్ని 2020లో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఎండోమెంట్ కమిషనర్‍ అనిల్‍కుమార్​ దృష్టికి మీడియా తీసుకెళ్లింది. ఉమ్మడి ఏపీలో తెచ్చిన జీవో ప్రకారం ఇచ్చే 15 వేలను కూడా పెంచకపోవడాన్ని ప్రస్తావించింది. రామయ్య కల్యాణ లాంఛనాలకు సర్కారు తరఫున  లక్ష ఇవ్వాలనే ప్రపోజల్స్​ రెడీ చేసి పంపాలని కమిషనర్​ భద్రాచలం ఆఫీసర్లకు సూచించారు. దీంతో ఆఫీసర్లు  ప్రపోజల్స్​ రెడీ చేసి పంపినా.. ఇప్పటికీ ఆమోదముద్ర పడలేదు. 2021 కల్యాణానికి కూడా పైసా రాలేదు. ఏప్రిల్ 2 నుంచి  దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‍ 10న కల్యాణం జరగనుంది. ఈసారైనా పట్టువస్త్రాలకు పైసలు ఇస్తరా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

వేములవాడ, యాదాద్రిలోనూ ఇదే పరిస్థితి
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్కారు తరఫున పట్టువస్త్రాలు తీసుకెళ్లడం సంప్రదాయం. వేములవాడ, యాదాద్రి తదితర ఆలయాల్లో కల్యాణోత్సవాల్లో పాల్గొనే సీఎం, ఎండోమెంట్ మినిస్టర్లు.. దేవస్థానం కొనుగోలు చేసి ఇచ్చే పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని అప్పగిస్తున్నారు. నిజానికి సర్కారే లాంఛనం ఇవ్వాల్సి ఉన్నా.. జీవోలు ఇస్తున్నారు తప్పితే ఆలయాల అకౌం ట్లలో డబ్బులు జమ చేయడం లేదు.

ప్రపోజల్స్ పంపినా రాలె
శ్రీసీతారామచంద్రస్వామికి శ్రీరామనవమి రోజున కల్యాణ లాంఛనం కోసం రూ. లక్ష  సర్కారు నుంచి ఇచ్చేలా కమిషనర్​ ఆదేశాల మేరకు ప్రపోజల్స్ పంపాం. కానీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. అసలు స్వామి వారి కల్యాణం కోసం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కొనేందుకు ప్రభుత్వం నుంచి పైసా రావడం లేదు. జీవోలు మాత్రమే వస్తున్నాయి.
- శివాజీ, ఈవో, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం,భద్రాచలం