- ఐఐటీ, సీసీఎంబీ, డీఆర్డీఓ నిపుణులతో పాఠాల రూపకల్పన
- పాలిటెక్నిక్ స్టూడెంట్లకు వర్సిటీల ల్యాబ్‌లు, గ్రౌండ్లు
- టీజీసీహెచ్ఈ కీలక నిర్ణయాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ, పీజీ సిలబస్‌ను సమూలంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా సిలబస్ ఉండాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఐఐటీ, సీసీఎంబీ, డీఆర్డీఓ, సెంట్రల్ వర్సిటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల సీనియర్ ప్రొఫెసర్ల సలహాలు, సూచనలతో కొత్త కరికులం రూపొందించాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి ఆఫీసులో కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా సమక్షంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిగ్రీ, పీజీ చేస్తూనే ఉపాధి పొందేలా రూపొందించిన ‘చదువుతూ సంపాదించే’కోర్సులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 23 కాలేజీల్లోనే ఈ తరహా కోర్సులు ఉన్నాయని, వీటిని మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు విస్తరించాలని సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు.
వర్సిటీల సాయం పాలిటెక్నిక్‌లకు..
వనరుల వినియోగంలో పరస్పర సహకారం ఉండాలని కౌన్సిల్ ఈసీ నిర్ణయించింది. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు యూనివర్సిటీలు అండగా నిలవాలని సూచించారు. వర్సిటీల్లో అందుబాటులో ఉన్న అధునాతన ల్యాబ్‌లు, స్పోర్ట్స్ గ్రౌండ్స్‌ను పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా వాడుకునేలా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. రాబోయే కామన్ ఎంట్రెన్స్ టెస్టులను పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి టెక్నికల్, ఇతర ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు.
అలాగే, వర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ, వర్సిటీలకు పాలక మండళ్ల ఏర్పాటు అవశ్యకతను కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, పలువురు వీసీలు.. విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఆమె చెప్పినట్లు తెలిసింది. కాగా, కౌన్సిల్‌లో ఏమైనా వస్తువులు కొనుగోలు చేసినా, సిబ్బంది నియామకాలు చేపట్టినా కచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఆమె స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, మహమూద్, శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు
