తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకు అంటే  21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రెటేరియట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం (మే 23న) జరిగిన సమీక్షా సమావేశంలో ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ ప్రకటించారు. అవతరణ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి మే 25వ తేదీన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 

జూన్ 2న జాతీయ పతాకావిష్కరణ..

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారు. జూన్ 2న హైదరాబాద్ లోని అమరవీరుల స్థూపం (గన్ పార్క్) వద్ద  నివాళులర్పిస్తారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ ఆవిష్కరిస్తారు. అనంతరం దశాబ్ధి ఉత్సవ సందేశం ఇవ్వనున్నారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ధి ఉత్సవ కార్యక్రమాలు ఉండనున్నాయి. 

జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం

జూన్ 3న ‘తెలంగాణ రైతు దినోత్సవంగా జరపనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను తెలియజేసే కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయనున్నారు.

జూన్ 4న సురక్షా దినోత్సవం

జూన్ 4న పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘సురక్షా దినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ ఉత్తమ సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

జూన్ 5న తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం

జూన్ 5వ తేదీ సోమవారం ‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.

జూన్ 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

జూన్ 6న మంగళవారం ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’ జరుగుతుంది. పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.

జూన్ 7న సాగునీటి దినోత్సవం

జూన్ 7న బుధవారం ‘సాగునీటి దినోత్సవం’ నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. 

జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ

జూన్ 8న ‘ఊరూరా చెరువుల పండుగ’ నిర్వహిస్తారు. డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గోరేటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసిచెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.

జూన్ 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు

జూన్ 9 శుక్రవారం రోజున ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు. 

జూన్ 10న సుపరిపాలన దినోత్సవం

జూన్ 10న శనివారం ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’ జరుపుతారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

జూన్ 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం

జూన్ 11న ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’ నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటుంది.జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించాలని నిర్ణయించారు. 

జూన్ 12న తెలంగాణ రన్‌

జూన్ 12న సోమవారం ‘తెలంగాణ రన్’ నిర్వహిస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

జూన్ 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం

జూన్ 13 మంగళవారం ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’ నిర్వహిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు.

జూన్ 14న తెలంగాణ వైద్యారోగ్య శాఖ దినోత్సవం

జూన్‌ 14న ‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవా’న్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధి గురించి వివరిస్తారు. అదే రోజున నిమ్స్‌లో 2వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానా నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

జూన్ 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం

జూన్ 15 గురువారం ‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’ జరుపుతారు. ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలుంటాయి. అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.

జూన్ 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం

జూన్ 16న శుక్రవారం ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’ నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి.

జూన్17న తెలంగాణ గిరిజనోత్సవం

జూన్ 17న శనివారం ‘తెలంగాణ గిరిజనోత్సవం’ జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. 

జూన్ 18న మంచినీళ్ల పండుగ

జూన్‌ 18వ తేదీ ఆదివారం ‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’ నిర్వహిస్తారు. 

జూన్ 19న తెలంగాణ హరితోత్సవం 

జూన్ 19న సోమవారం ‘తెలంగాణ హరితోత్సవం’ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. 

జూన్ 20న తెలంగాణ విద్యాదినోత్సవం

జూన్ 20న ‘తెలంగాణ విద్యాదినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. అదేరోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు. 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభిస్తారు. విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు.

జూన్ 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

జూన్ 21న ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర మత ప్రార్థనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి.

జూన్ 22న తెలంగాణ అమరుల సంస్మరణ కార్యక్రమం

జూన్ 22న ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు, నగరాలు, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాదులో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ అదే రోజున ఆవిష్కరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు.