రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం
  • మ్యాగ్జిమమ్‌ రూ.1.60 లక్షలు.. మినిమమ్‌ రూ.45 వేలు
  • చిన్న కాలేజీల్లోనూ భారీగా పెరిగిన ఫీజులు 
  • ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ ఫీజులు కూడా పెంపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారయ్యాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్‌ఆర్సీ) సిఫార్సుల మేరకు మొత్తం 159 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా రూ.1.60 లక్షల ఫీజు ఉండగా, తక్కువగా రూ.45 వేలు నిర్ణయించారు. పెద్ద కాలేజీలతో పోలిస్తే చిన్న కాలేజీల్లోనూ ఫీజులు భారీగా పెంచేశారు. 40 కాలేజీల్లో ఫీజులు రూ.లక్ష దాటాయి. 

రాష్ట్రంలోని 159 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2022–25 బ్లాక్ పీరియడ్‌‌కు సంబంధించి ఫీజులను నిర్ణయించారు. టీఏఎఫ్‌‌ఆర్సీ ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌మెంట్లతో మూడుసార్లు సమావేశమై, సర్కారుకు ప్రతిపాదనలు పంపించగా, ఆ ఫీజులకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ ఫీజులు2022–23, 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో అమలు కానున్నాయి. 2019–22 బ్లాక్ పీరియడ్‌‌తో పోలిస్తే చిన్న కాలేజీల్లో వసతులు లేవని, జీతాలు సరిగా ఇవ్వడం లేదనే విమర్శలున్న పలు కాలేజీలకూ భారీగానే ఫీజులు పెంచారు. ఎంజీఐటీ కాలేజీలో రూ.1.08 లక్షలు ఉన్న ఫీజును అత్యధికంగా రూ.1.60 లక్షలకు పెంచింది. సీవీఆర్‌‌‌‌హెచ్ కాలేజీలో రూ.1.15 లక్షలుంటే, రూ.1.50 లక్షలు చేశారు. సీబీఐటీ, వర్ధమాన్, వాసవి కాలేజీల్లో రూ.1.40 లక్షల ఫీజు ఉంది. మినిమమ్ ఫీజు గతంలో రూ.35 వేలు ఉంటే, దానిని రూ.45 వేలకు పెంచారు. రూ.45 వేలు ఫీజులున్న కాలేజీలు కేవలం తొమ్మిది ఉన్నాయి. గతంలో 20 కాలేజీల వరకు రూ.45 వేలలోపే ఫీజు ఉంది. ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ కోటాలో చేరే స్టూడెంట్లకు 5 వేల డాలర్ల ఫీజు వసూలు చేయాలని సర్కారు జీవోలో పేర్కొంది. ట్యూషన్‌‌ ఫీజు కంటే రూ.3 వేలు మాత్రమే ఎక్కువ వసూలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. చాలా కాలేజీల్లో రూ.60 వేల నుంచిలక్షకు పైగా ఫీజులు పెరిగాయి.     

ఆడిటింగ్ తప్పులు గుర్తించకుంటే? 
టీఏఎఫ్‌‌ఆర్సీ నిర్వహించిన ఆడిట్ లోపాలతో సగానికి పైగా కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగాయి. గత బ్లాక్ పీరియడ్‌‌ కంటే ఈసారి ఫీజు తగ్గడంతో ఓ కాలేజీ రివ్యూ కోరింది. ఈ సమయంలో ఆడిట్ లోపాలు బయటపడ్డాయి. దీంతో తప్పులు దిద్దుకునేందుకు మరోసారి మేనేజ్‌‌మెంట్లతో హియరింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చాలా కాలేజీల్లో ఫీజులు భారీగా తగ్గాయి. ఒక్క సీబీఐటీలోనే రూ.1.73 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు తగ్గింది. ఒకవేళ ఆడిటింగ్ తప్పులను ఎవరూ గుర్తించకపోతే, ఈ ఫీజుల భారం విద్యార్థులపై పడేది. ఎంటెక్‌‌లో రూ.1.51 లక్షలు.. 76 ప్రైవేటు ఎంటెక్ కాలేజీల్లోనూ 2022–25 బ్లాక్ పీరియడ్‌‌కు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. అత్యధికంగా సీబీఐటీలో రూ.1,51 లక్షలు, శ్రీనిధిలో రూ.1.50 లక్షలు, ఎంజీఐటీలో రూ.1.35 లక్షలు ఫిక్స్ చేశారు. మినిమమ్ ఫీజు రూ.57 వేలుగా నిర్ణయించారు. కాగా, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లోనూ ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది. ఎంబీఏ కాలేజీల్లో అత్యధికంగా బీవీ భవన్స్ కాలేజీలో రూ.1.10 లక్షల ఫీజు ఉంది. తక్కువగా రూ.27 వేలు ఉంది. ఎంసీఏ కాలేజీల్లో మినిమమ్ ఫీజు రూ.30 వేలు ఉండగా, మ్యాగ్జిమమ్‌‌ సీబీఐటీలో రూ.95 వేలుగా ఉంది.

ఫీజులు తగ్గించాలె: యూనియన్లు 
పెంచిన ఫీజులను తగ్గించాలని ఎస్‌‌ఎఫ్‌‌ఐ, ఏబీవీపీ, ఏఐఎస్‌‌ఎఫ్‌‌​ సంఘాలు డిమాండ్ చేశాయి. కరోనాతో స్టూడెంట్ల తల్లిదండ్రుల ఆదాయం తగ్గిపోయిందని, ఇలాంటి టైమ్‌‌లో ఫీజులు పెంచడం సరికాదని ఆయా సంఘాలు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఫీజులను తగ్గించకపోతే ఉద్యమాలు చేస్తామన్నాయి.