కొత్త సెక్రటేరియట్ కు ముగ్గన్నా పోయలే..రూ.300 కోట్లు పెంచారు

కొత్త సెక్రటేరియట్ కు ముగ్గన్నా పోయలే..రూ.300 కోట్లు పెంచారు
  • సెక్రటేరియట్ నిర్మాణంలో ఇదీ మాయ
  • పూర్తయ్యే నాటికి రూ.1,200 కోట్లు అయ్యే చాన్స్

హైదరాబాద్​, వెలుగు: కొత్త సెక్రటేరియట్​కు ఇంకా ముగ్గైనా పోయలేదు. కానీ, అప్పుడే అంచనా ఖర్చు పెరిగిపోయింది. ముందు అనుకున్న ఖర్చు కన్నా డబుల్​ అయింది. ఆ అదనపు ఖర్చుకు సోమవారం కేబినెట్​ ఓకే చెప్పింది. సెక్రటేరియట్​ పూర్తయ్యే నాటికి అది కూడా సరిపోకపోవచ్చని అధికారులు అంటున్నారు. మొత్తంగా వెయ్యి కోట్ల నుంచి రూ.1,200 కోట్ల దాకా ఖర్చయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 25 ఎకరాల్లో 7 అంతస్తులతో 6 లక్షల చదరపుటడుగుల మేర కొత్త సెక్రటేరియట్​ను కట్టాలని సర్కార్​ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు జులై 6 నుంచి రహస్యంగా పాత బిల్డింగ్​కూల్చివేతలను చేపట్టింది. దాదాపు లక్ష టన్నుల శిథిలాలను తరలించారు. ఇప్పటికే భూమి చదును కూడా పూర్తయింది. ఇంకా కొన్ని అనుమతులు రాలేదని, అందుకే టెండర్లు ఆగిపోయాయన్న చర్చ జరుగుతోంది.

నెల రోజుల్లోనే పెంపు

కొత్త సెక్రటేరియట్ అంచనా ఖర్చును ప్రభుత్వం నెల రోజుల్లోనే పెంచింది. పోయిన నెల 5న జరిగిన కేబినెట్​లో సెక్రటేరియట్​ కట్టేందుకు రూ.400 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. దానికి కేబినెట్​ ఓకే చెప్పింది. టెండర్లు పిలిచేందుకు ఆర్​ అండ్​ బీ శాఖ కసరత్తులు మొదలుపెట్టింది. ఆ ఫైల్​ను సీఎం ఆమోదం కోసం పంపింది. దానిపై ఇంజనీర్లతో సీఎం కేసీఆర్​ రివ్యూలు చేశారు. సీఎం ఓకే చెప్పిన డిజైన్​ ప్రకారం బిల్డింగ్​ కట్టాలంటే ఖర్చు పెంచక తప్పదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని,  అందుకే మరో రూ.300 కోట్లు పెంచారని అంటున్నారు. ఈ అదనపు ఖర్చుతో మొత్తంగా నిర్మాణ ఖర్చు రూ.700 కోట్లకు పెరిగింది. ఇది జస్ట్​ సివిల్​ వర్క్స్​ కోసమేనని, అందులో పార్కులు, ఇన్నర్​ రోడ్లు, హెలిప్యాడ్​ వంటి పనులే ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పాత సెక్రటేరియట్​ బిల్డింగ్​ కూల్చివేతలు, ఆ శిథిలాల తరలింపు కోసమే ప్రభుత్వం రూ.10 కోట్లు ఖర్చు పెట్టింది. ఈఖర్చుకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. సెక్రటేరియట్​ కాంపౌండ్​లోని మొత్తం 10 బిల్డింగులను కూల్చివేశారు. కూల్చివేతలకు ముంబై నుంచి ప్రత్యేక మెషీన్లు తెప్పించారు. బీహార్​ నుంచి ఇంజనీర్లను రప్పించారు. అన్ని బిల్డింగులను నేలమట్టం చేసేందుకు నెల రోజులకుపైగా సమయం పట్టింది. శిథిలాలను హైదరాబాద్​ సిటీ శివారులోని రాంకీ ప్రాసెసింగ్​ సెంటర్​కు తరలించారు.

అనుమతులు పెండింగ్​!

సెక్రటేరియట్​ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. కొన్ని డిపార్ట్​మెంట్ల నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఎన్విరాన్మెంట్​, జీహెచ్​ఎంసీ, సివిల్​ ఏవియేషన్​, ఫైర్​ సేఫ్టీ అనుమతులు పెండింగ్​లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా కొన్ని శాఖల నుంచీ అనుమతులు రావాలని చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని అనుమతులు వచ్చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. అన్ని అనుమతులు వచ్చాకే టెండర్లు పిలవాలని ప్రభుత్వం అనుకుంటోంది. హడావుడిగా టెంటర్లను పిలిచి, న్యాయపరమైన చిక్కులు కొని తెచ్చుకోవద్దని సర్కారు అభిప్రాయపడుతోందని అధికారులు చెబుతున్నారు.

30% ఖర్చు ఇంటీరియర్​కే..

సివిల్​ వర్క్స్​ కోసం పెట్టే ఖర్చులో ఇంటీరియర్​ పనులకే 30 శాతం దాకా ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. సీఎం కోసం కేటాయించిన ఫ్లోర్​ మొత్తాన్ని బుల్లెట్​ప్రూఫ్​గా చేసేందుకు రూ.60 కోట్లు అవుతుందని అంచనా వేశారు. సీఎం చాంబర్​, కేబినెట్​ మీటింగ్​ జరిగే కాన్ఫరెన్స్​ హాల్​, రెగ్యులర్​ మీటింగ్​ జరిగే హాల్స్​లో ఇంపోర్టెడ్​ ఫర్నీచర్​ ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. దానికి దాదాపు రూ.50 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంత్రులు, ఐఏఎస్​ చాంబర్ల కోసం కూడా ఖరీదైన ఫర్నీచర్​నే వాడుతున్నట్టు తెలుస్తోంది. సివిల్​ వర్క్స్​ పూర్తయిన తర్వాత ఇంటీరియర్​ పనుల కోసం ఎంత ఖర్చు అవుతుందో క్లారిటీ వస్తుందని ఓ సీనియర్​ అధికారి చెప్పారు.