డీఈడీ ఎగ్జామ్స్ ఇంకెప్పుడు?..అయోమయంలో స్టూడెంట్స్

డీఈడీ ఎగ్జామ్స్ ఇంకెప్పుడు?..అయోమయంలో స్టూడెంట్స్
  •     ఏప్రిల్‌‌లో జరగాల్సిన పరీక్షలు కరోనాతో వాయిదా
  •     ఇప్పటికీ షెడ్యూల్‌‌ ప్రకటించని విద్యాశాఖ
  •     అయోమయంలో స్టూడెంట్స్‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​(డీఈడీ) యాన్యువల్‌‌​ ఎగ్జామ్స్‌‌పై స్పష్టత కరువైంది.  కరోనా లాక్‌‌డౌన్‌‌తో వాయిదాపడిన ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక స్టూడెంట్స్‌‌ అయోమయానికి గురవుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు కాలేజీలకు ఏ విధమైన సమాచారం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఉన్న 180 డీఈడీ కాలేజీల్లో సుమారు 11 వేల మంది చదువుతున్నారు. ఏప్రిల్20 నుంచి యాన్యువల్‌‌ ఎగ్జామ్స్‌‌ నిర్వహిస్తామని అధికారులు కాలేజీలకు గతంలో సమాచారం ఇచ్చారు. అయితే మార్చి లాస్ట్ వీక్ నుంచే రాష్ట్రంలో లాక్‌‌డౌన్ మొదలు కావడంతో ఎగ్జామ్స్‌‌ వాయిదా వేశారు. కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతున్నా, కేంద్ర ప్రభుత్వం గైడ్‌‌లైన్స్ ఆధారంగా కొన్ని కోర్సులకు పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలు ఇటీవలే పూర్తికాగా, వివిధ వర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ, బీఈడీ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. కానీ, డీఈడీ ఎగ్జామ్స్‌‌కు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో 7 వేల మంది సెకండియర్‌‌‌‌ స్టూడెంట్స్‌‌, ఫస్టియర్ పూర్తయిన 4 వేల మంది పరీక్షల షెడ్యూల్‌‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పలు కాలేజీల్లో ఫస్టియర్ స్టూడెంట్లకు ఆన్‌‌లైన్‌‌లో సెకండియర్ క్లాసులు చెబుతున్నారు. సెకండియర్ కంప్లీట్‌‌ చేసిన స్టూడెంట్స్​మాత్రం ఎగ్జామ్స్‌‌ షెడ్యూల్‌‌ కోసం వెయిట్‌‌ చేస్తున్నారు. కాలేజీలకు పోయి దాదాపు ఐదు నెలలు గడిచిపోయిందని, దీంతో చదివిందంతా మరిచిపోతున్నామని సెకండ్‌‌ ఇయర్‌‌‌‌ చదివిన స్టూడెంట్స్‌‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ ఫస్ట్ వీక్‌‌లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు.

ఎన్నిరోజులు వెయిట్ చేయాలె

ఏప్రిల్‌‌లో జరగాల్సిన పరీక్షలు కరోనాతో వాయిదా పడ్డాయి. ఐదు నెలలు పూర్తయినా ఇప్పటికీ ఎవ్వరూ పరీక్షల మాటే ఎత్తడం లేదు. ఇంటిదగ్గరే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నం. పరీక్షల కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలియడం లేదు. వెంటనే షెడ్యూల్ ప్రకటించి, ఎగ్జామ్స్ నిర్వహించాలి.

– సాయికిరణ్​, డీఈడీ స్టూడెంట్, వరంగల్