మున్సిపాలిటీలకు మూడేండ్లుగా స్పెషల్​ ఫండ్స్​ ఇవ్వని సర్కార్

మున్సిపాలిటీలకు మూడేండ్లుగా స్పెషల్​ ఫండ్స్​ ఇవ్వని సర్కార్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:
మున్సిపాలిటీల్లో మూడేండ్లుగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు గవర్నమెంట్​ ఒక్క పైసా మంజూరు చేయలేదు. పట్టణ ప్రగతిలో భాగంగా సౌలతులు కల్పిస్తున్నామని సర్కారు చెబుతున్నా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, రిపేర్లకు స్పెషల్​ ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడంపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం పచ్చదనం, పరిశుభ్రతకే పరిమితమైందనే విమర్శలున్నాయి. కనీసం రిపేర్లు కూడా చేయకపోవడంతో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా మారి ప్రజలు తిప్పలు పడుతున్నారు. 

మూడేండ్లుగా నిధులు రాలె..
జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల్లో పలు బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు లేకపోవడంతో ఇంటర్నల్​ రోడ్లు, డ్రైనేజీలు శిథిలావస్థకు చేరి అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వం స్పెషల్​ ఫండ్​ ఇవ్వకపోవడంతో మూడేండ్లుగా డీఎంఎఫ్​, సీఎస్ఆర్​ ఫండ్స్​పైనే ఆధారపడాల్సి వస్తుందని కౌన్సిలర్లు వాపోతున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీకి  రెండేండ్లుగా డీఎంఎఫ్​ నిధులు కూడా కేటాయించలేదు. నాలుగేండ్ల కింద మంజూరైన నిధులతోనే పనులు చేపట్టారు. కొత్తగూడెంలోని కూలీలైన్, బూడిదగడ్డ, రామవరం, మేదరబస్తీ తదితర ప్రాంతాల్లో ఇంటర్నల్​ రోడ్లు అధ్వానంగా మారాయి. బూడిదగడ్డ రెండో వార్డులోని మూడు కాలనీల్లో రాకపోకలకు ప్రజలు తిప్పలు పడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీల కోసం రూ.20 కోట్లతో గవర్నమెంట్​కు ప్రపోజల్స్​ పంపారు. పాల్వంచ పట్టణంలోని పేట చెరువు, పిల్లవాగు, బంగారుజాల, కొత్తూరు, శేఖరం బంజార,  గాజులగూడెం ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీల్లోని పలు బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి డీఎంఎఫ్​, సీఎస్ఆర్​ ఫండ్స్​పైనే ఆధారపడాల్సి వస్తోంది. రోడ్లు గుంతలమయంగా మారడం, డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరంతా రోడ్లపై పారుతోంది. 

పట్టణ ప్రగతికే ఫండ్స్.. 
పట్టణ ప్రగతిలో భాగంగా మూడు విడతల్లో కొత్తగూడెం మున్సిపాలిటీకి రూ.2 కోట్లు కేటాయించగా, రూ.1.52 కోట్లు ఖర్చు చేశారు. పాల్వంచలో రూ.2.20 కోట్లలో రూ.1.45 కోట్లు, మణుగూరులో రూ. కోటిలో రూ.70 లక్షలు, ఇల్లందులో రూ. 87లక్షల్లో రూ.73 లక్షలు ఖర్చు చేశారు. ఈ నిధులను పారిశుధ్యం, విద్యుత్, హరితహారంతో పాటు ప్లేగ్రౌండ్స్, మెయిన్​రోడ్​ లైటింగ్​ కోసం కేటాయించారు. నాలుగో విడతలోనూ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, తాగు నీటికి నిధులు మంజూరు చేయలేదని అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

ప్రభుత్వం​ నిర్లక్ష్యం చేస్తుంది..
మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలకు ఫండ్స్​ రిలీజ్​ చేయకుండా గవర్నమెంట్​ నిర్లక్ష్యం చేస్తోంది. కొత్తగూడెం టౌన్​లోని పలు బస్తీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రానికి ప్రాధాన్యత ఇస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మున్సిపాలిటీలను పట్టించుకోకపోవడం సరైంది కాదు. జిల్లా ఎమ్మెల్యేలు నిధులు వచ్చేలా ఒత్తిడి తేవాలి. 
- కోనేరు సత్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​

నిలదీసినా నిధులిస్తలేరు.. 
కొత్తగూడెం మున్సిపాలిటీలోని రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఫండ్స్​ ఇవ్వాలని కౌన్సిల్​ మీటింగ్​లో నిలదీసినా నిధులు ఇస్తలేరు. ఈ విషయాన్ని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లాం. కొత్తగూడెం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగు నీరు, స్ట్రీట్​ లైట్ల కోసం స్పెషల్​ ఫండ్స్​ శాంక్షన్​ చేయాలి.
-  వై. శ్రీనివాస్​రెడ్డి, సీపీఐ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్, కొత్తగూడెం