ఆర్టీసీలో జీతాల పెంపు ఎప్పుడు? .. సీఎం చెప్పి 20 రోజులైనా ఒక్క అడుగుపడలే

ఆర్టీసీలో జీతాల పెంపు ఎప్పుడు? .. సీఎం చెప్పి 20 రోజులైనా ఒక్క అడుగుపడలే
  •     ఇప్పటికే 2 పీఆర్సీలు పెండింగ్
  •     ఆందోళనలకు రెడీ అవుతున్న యూనియన్లు

హైదరాబాద్, వెలుగు: జీతాలు పెంచుతామని చెప్పిన సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవండంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తను ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఎప్పట్లాగే అవసరానికో ప్రకటన అన్న తీరుగా వ్యవహరిస్తే ఆందోళనలకు దిగుతామని కార్మికులు, యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. ‘‘రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు త్వరలోనే పెంచాలని నిర్ణయించాం, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోండి’’ అని ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారని ఈనెల 1న మే డే సందర్భంగా సీఎంవో ప్రకటన వెలువరించింది. 20 రోజులు అయినా దీనిపై ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవటంతో ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. జీతాల పెంపుపై ప్రకటన వెలువడిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి జీవో, ఉత్తర్వులు, కనీసం ఆర్టీసీ ఎండీ, ఇతర అధికారులతో రివ్యూ చేసి, జీతాలు ఎంత ఉన్నాయి, ఎంత పెంచాలి, ఆర్థిక భారం వంటి అంశాలు సైతం ఇంత వరకు చర్చించకపోవడాన్ని ఖండిస్తున్నారు.

బడ్జెట్​లో చెప్పినవి కూడా ఇస్తలె

ఆర్టీసీ కార్మికులకు 2017, 2021 పీఆర్సీలు పెండింగ్ లో ఉంది. ఇది కాకుండా 2012 పీఆర్సీకి సంబంధించి 50 శాతం బకాయిలు ఉన్నాయి. వీటి కోసం ఎంతో కాలంగా పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నా మేనేజ్ మెంట్, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఆర్టీసీకి ఉన్న నష్టాలు, అప్పుల కారణంగా ప్రతి నెల కార్మికుల జీతాలకు సరిపడా ఫండ్స్ లేకపోవటంతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారు. మరో వైపు బడ్జెట్ లో ఆర్టీసీకి కేటాయిస్తున్న నిధులను సైతం ప్రభుత్వం సరిగాలో రిలీజ్ చేయట్లేదు.

మునుగోడు హామీలు అమలు కాలే

మునుగోడు ఎలక్షన్ ముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పువ్వాడ అజయ్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ యూనియన్లతో పలు సార్లు చర్చలు జరిపారు. పీఆర్సీ ఇచ్చేందుకు ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా ఉందని చెప్పారు. పీఆర్సీ ఇచ్చేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఈసీకి లేఖ కూడా రాశారు. ఈసీ అనుమతి ఇవ్వకపోవటంతో ఆ హామీ అటకెక్కింది. మునుగోడులో ఆర్టీసీ కార్మికులు సుమారు 8 వేల మంది ఉండటంతో వారి ఓట్ల కోసమే ఈ హామీలు ఇచ్చారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఎలక్షన్స్ అయి ఏడు నెలలు కావోస్తున్నా ఇంత వరకు ఆ హామీలు అమలు కాలేదు. దీంతో యూనియన్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎలక్షన్స్ ముందు హడావుడి చేసిన మంత్రులు ఎన్నిక పూర్తయ్యాక యూనియన్ నేతలకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇస్తలేరు. దీంతో కార్మికులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎలక్షన్ తరువాత మునుగోడులో మంత్రి కేటీఆర్ నిర్వహించిన మీటింగ్ కు తమను అనమతించలేదని ఆర్టీసీ యూనియన్ల నేతలు గుర్తు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల ఓట్ల కోసం మంత్రులు హామీలు ఇచ్చారని, తరువాత పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.

ఆందోళనలు షురూ

ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి. మునుగోడు ఎలక్షన్ అయ్యాక లెఫ్ట్ పార్టీ అనుబంధ సంఘం అయిన ఎంప్లాయిస్ యూనియన్ మునుగోడు నుంచి బస్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించింది. “ఆర్టీసీ కార్మికులు పెండింగ్ లో ఉన్న 2 పీఆర్సీలు చెల్లించాలి. యూనియన్లను అనుమతించాలి. 2013 పీఆర్సీ బకాయిలు చెల్లించాలి. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీసీఎస్ బకాయిలు రూ.1100 కోట్లు విడుదల చేయాలి. అనేవి ప్రధాన డిమాండ్లుగా ఈనెల 16న అన్ని డిపోల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టినం. ఈనెల 30న ఇందిరా పార్క్ దగ్గర ఆర్టీసీ కార్మికులతో సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నం” అని ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డిలు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు ముదిరాజ్ తెలిపారు. ఈనెల 28న రాష్ట్ర కమిటీ సమావేశం తరువాత కార్యచరణ ప్రకటిస్తామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో కార్మికులతో బస్ భవన్ ను ముట్టడిస్తామని తెలిపారు