మార్కెట్లో మక్కలు కొనట్లే.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని సర్కార్

మార్కెట్లో మక్కలు కొనట్లే.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని సర్కార్
  • కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని సర్కారు
  • అడ్డికి పావుసేరు అడుగుతున్న వ్యాపారులు
  • మద్దతు ధర కంటే రూ.500 తక్కువకు కొంటున్నరు
  • దీంతో రైతులు రూ.400 కోట్లు నష్టపోయే పరిస్థితి
  • ఇప్పటికే వానలకు సగం పంట నష్టం
  • ప్రభుత్వం మక్కలు కొంటదో లేదోనని రైతుల టెన్షన్

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలో మక్క రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే వానలకు సగానికిపైగా పంటలు దెబ్బతినడం, వచ్చిన పంటను ప్రైవేటు వ్యాపారులు అడ్డికి పావుసేరు అడుగుతుండటంతో లబోదిబోమంటున్నారు. క్వింటాల్‌ ధర రూ.1,850 ఉండగా.. ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.500 తక్కువకే అడుగుతున్నారు. దీంతో 2.25 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేసిన రైతులు రూ.400 కోట్ల వరకు నష్టపోవాల్సి వస్తోంది. మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది.షరతుల సాగులో భాగంగా మక్కలు వేయొద్దని సర్కారు ఆంక్షలు విధించిందని, అందుకే ఆ పంట కొనడానికి ముందుకు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు మక్కలు కొనకపోతే పరిస్థితి ఎట్ల అని రైతులు టెన్షన్‌‌ పడుతున్నారు.

కొనుగోలు కేంద్రాలేవీ?

షరతుల సాగులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మక్కలు వేయెద్దని రైతులను ఆదేశించింది. దీంతో మక్కల సాధారణ సాగులో 5 లక్షల ఎకరాలు తగ్గింది. దాదాపు 2.25 లక్షల ఎకరాల్లో రైతులు మక్కలు వేశారు. రాష్ట్రంలో 7.65 లక్షల టన్నుల వరకు మక్కలు దిగుబడి రావచ్చని అంచనా. అయితే మార్క్ ఫెడ్ మాత్రం మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో ప్రభుత్వం కొంటదో లేదోనని రైతులు అయోమయంలో ఉన్నారు. మక్కలకు మద్దతు ధర క్వింటాల్‌‌ రూ.1,850 ఉండగా.. ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.500 తక్కువకే అడుగుతున్నారు. దీంతో రాష్ట్రంలో రైతులు వానాకాలంలో రూ. 393 కోట్ల వరకు నష్టం పోవాల్సి వస్తోంది. ప్రైవేటు వ్యాపారులు క్విం టాల్‌‌కు మద్దతు ధర కంటే రూ.500 తక్కువ ఇచ్చి కొంటుండటంతో రైతులు  ఎకరానికి రూ.17,500 వరకు నష్టపోతున్నారు. అంటే 7.65 లక్షల టన్నులకు గానూ రైతులు రూ.393 కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

మార్క్‌‌ ఫెడ్‌‌కు సర్కార్ నిధులిస్తలే

పంటలను కొనేందుకు మార్క్‌‌ఫెడ్‌‌ వద్ద డబ్బులు లేవు. ఇప్పటికే బ్యాంకులకు రూ.2 వేల కోట్లకు పైగా బాకీ పడడంతో కొత్తగా అప్పు పుట్టడం లేదు. మద్దతు ధరకు కొన్న పంటను వ్యాపారులకు తక్కువకు అమ్మాల్సి వస్తుండడంతో రూ.వందల కోట్లు నష్ట పోయింది. మొక్కజొన్న పంట కొనే పరిస్థితి లేదనే కారణంతో షరతుల సాగు పేరుతో ఈ వానాకాలం సీజన్​లో మక్కలు వేయవద్దని రైతులపై సర్కారు ఆంక్షలు విధించింది. మరోవైపు కొనుగోళ్ల వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన రాష్ట్ర సర్కార్‌‌ పట్టించుకోవడం లేదు. ఆరేండ్లలో రూ.35 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది