రైతులకు లోన్లు రాలే.. పరిహారం ఇయ్యలే

రైతులకు లోన్లు రాలే.. పరిహారం ఇయ్యలే
  • ‘భద్రాద్రి కొత్తగూడెం’ రైతుల ఎదురుచూపులు
  • నివేదికలు పంపామంటున్నఆఫీసర్లు
  • సప్పుడు జేయని సర్కారు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగుఆగస్టు నెలలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంకా దాని ఊసెత్తడం లేదు. నష్టంపై అధికారులు సర్వే చేసి పంపినా ఇంతవరకు స్పందన లేదు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

రూ.7 కోట్లకు పైగానే

జిల్లాలో గత ఆగస్టులో కురిసిన వర్షాలు, వరదలకు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు రూ. 4.38 కోట్ల పంట నష్టం జరిగింది. అనధికారికంగా ఈ లెక్క దాదాపు రూ.7కోట్లకు పైగానే ఉందని రైతు సంఘాల నేతలు అంటున్నారు.  4,318 మంది రైతులకు చెందిన 5,790 ఎకరాల్లో వరి పంట మునిగింది. 2,537 మంది రైతుల 4,337 ఎకరాల పత్తి, 12 మంది రైతులకు చెందిన 15 ఎకరాల పెసర,  ఏడుగురు రైతులకు సంబంధించి ఏడు ఎకరాల  కంది వరద పాలైంది. మొత్తంగా 6,871 మంది రైతుల 10,167 ఎకరాలను వర్షం, వరదలు ముంచాయి. తర్వాత గ్రామాల్లో పర్యటించిన అధికారులు పంట నష్టం వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. దీంతో రైతులంతా తమకు పరిహారం వస్తుందని ఆశపడ్డారు. కానీ నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అధికారులు మాత్రం అన్ని వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని, తమ చేతుల్లో ఏమీ లేదంటున్నారు.

నాసిరకం విత్తనాలతో మరో భారం

నియంత్రిత సాగు విధానంలో భాగంగా వ్యవసాయాధికారులు చెప్పినట్టు ఆళ్లపల్లి మండలంలో రైతులంతా సన్నరకం విత్తనాలు వేశారు. 125 రోజుల్లో దిగుబడి వస్తుందని అధికారులు చెప్పడంతో మరో పంట వేసుకోవచ్చనుకున్నారు. వ్యవసాయశాఖాధికారుల దగ్గర విత్తనాలు కొని 200 ఎకరాలకు పైనే వేశారు. కానీ దిగుబడి లేకపోవడంతో నష్ట పరిహారం చెల్లించాలని వ్యవసాయశాఖ ఆఫీస్ ఎదుట అక్టోబర్​లో ధర్నాలు కూడా చేశారు. దీంతో పంట నష్టంపై అధికారులు సర్వే చేశారు. కాని ఎంత నష్టం జరిగిందో   చెప్పలేదు. వీటికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పటి వరకూ అందలేదు. అయితే రైతులు దాదాపు రూ. 1.50 నుంచి రూ. 2 కోట్ల మేర నష్టపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్​ పాషా చెబుతున్నారు.