ఆరేండ్లలో భర్తీ చేసింది 29 వేల పోస్టులే

ఆరేండ్లలో భర్తీ చేసింది 29 వేల పోస్టులే

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో గడిచిన ఆరేండ్లలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్​కమిషన్​(టీఎస్​పీఎస్సీ) ద్వారా 29,091 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. మరో 7,552 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆయా పోస్టుల భర్తీకి మొదటి నాలుగేండ్లలో ఎక్కువగానే నోటిఫికేషన్లు ఇవ్వగా, గత రెండేండ్లలో మాత్రం నాలుగే నోటిఫికేషన్లు ఇచ్చారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ యాక్టివిస్ట్ జలగం సుధీర్ టీఎస్ పీఎస్సీ నుంచి వివరాలు సేకరించారు. 2015  జులై నుంచి 2020 జులై వరకు రిక్రూట్ మెంట్ కు సంబంధించిన సమాచారాన్ని టీఎస్ పీఎస్సీ అందించింది.

36,643 పోస్టులు నోటిఫైడ్

రాష్ట్రంలో మొత్తం 39,952 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది. వీటిలో 36,643 పోస్టులనే అధికారులు నోటిఫై చేశారు. ఈ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ105 నోటిఫికేషన్లు జారీ చేయగా.. 49,07,616 మంది క్యాండిడేట్లు అప్లై చేశారు. వీటిలో ఇప్పటి వరకు 29,091 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. మరో 5,916 పోస్టులు కోర్టు కేసులు/ వెయిటేజీ మార్కుల వివరాలు అందక పెండింగ్​లో ఉండగా… 1,636 పోస్టులు మెరిట్ లిస్టు ఇచ్చినవి/సర్టిఫికేట్ల వెరిఫికేషన్ దశలో ఉన్నాయి. 4,207 పారా మెడికల్ పోస్టులు.. 1,419 గురుకుల పీఈటీ, టీఆర్టీ పోస్టులు కోర్టు కేసుల్లో ఉన్నాయి. 290 పోస్టులకు 30 శాతం వెయిటేజీ మార్కులు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్​మెంట్ నుంచి అందాల్సి ఉంది.

చివరి రెండేండ్లలో నాలుగే నోటిఫికేషన్లు

గత ఆరేండ్లలో టీఎస్ పీఎస్సీ 105 నోటిఫికేషన్లు ఇవ్వగా.. వాటిలో 51 నోటిఫికేషన్లు 2017లోనే ఇచ్చింది. ఆ ఏడాదే మూడింట రెండొంతుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. 2015లో 13, 2016లో 12, 2018లో 25 నోటిఫికేషన్లు ఇచ్చారు. కమిషన్ గత రెండేండ్లలో మాత్రం నాలుగే నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. 2019లో మూడు, 2020లో ఒకటే నోటిఫికేషన్ ఇచ్చింది. 2017–18, 2018–19, 2019–20 ఫైనాన్షియల్ ఇయర్లకు టీఎస్ పీఎస్సీ అధికారులు, సిబ్బంది జీతాలకు రూ.36,64,49,870 ఖర్చు అయింది.