సర్కారు చదువులను నాశనం చేస్తున్నరు

సర్కారు చదువులను నాశనం చేస్తున్నరు

ఓయూలో 3,213 శాంక్షన్డ్‌ పోస్టులకు 2,064 పోస్టులు ఖాళీ
గురుకులాల ఖర్చును రెండు శాఖల్లోనూ చూపిస్తున్నరు
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్​
దేశంలో అన్ని వర్సిటీల్లోనూ రిక్రూట్‌మెంట్‌ ఆగింది: హరీశ్​
భూములమ్మి రూ. 16 వేల కోట్లు తెస్తామని వెల్లడి


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ విద్యా వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని, పేద, మధ్య తరగతి కుటుంబాలు చదువుకోకుండా ఆగం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీల కోసం పెద్ద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వర్సిటీల్లో చదువుకున్న సభ్యులు కూడా అసెంబ్లీలో మాట్లాడకపోతే ద్రోహం చేసిన వాళ్లవుతారని విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌‌‌‌‌‌‌‌పై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రాబడి రూ. 1.76 లక్షల కోట్లు వస్తుందని చూపించారని, అది రూ. 1.20 లక్షల కోట్లు కూడా దాటదని తాను చెప్పానని, దానిపై సమాధానం ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు స్పెషల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిధుల ద్వారా ఖర్చు చేస్తున్నారని, గురుకులాలకు సంక్షేమ శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నామని ఒకసారి, విద్యాశాఖ నిధులు అని ఇంకోసారి లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇలా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.  ఉస్మానియా యూనివర్సిటీలోని  3,213 శాంక్షన్డ్‌‌‌‌‌‌‌‌ పోస్టుల్లో  2,064 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. 50శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ. 5,522 కోట్లతో రెండు శాతం కూడా ఇవ్వలేదని, సంక్షేమానికి బ్రహ్మాండంగా చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు. మధ్యలో మంత్రి హరీశ్​రావు జోక్యం చేసుకున్నారు. శనివారం జరిగిన చర్చలో భట్టి సభను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడారని, దానిపై తాను క్లారిటీ కూడా ఇచ్చానని అన్నారు. వాస్తవాన్ని భట్టి అంగీకరిస్తే ఆయన సీనియారిటీకి బాగుంటుందని, గౌరవంగా, హుందాగా ఉంటుందని చెప్పారు. మళ్లీ భట్టి మాట్లాడుతూ గ్యారెంటీస్‌‌‌‌‌‌‌‌తో కలిపి రాష్ట్రంలో రూ.  3,91,800 కోట్ల అప్పు ఉందన్నారు. ఇంత లేదని మంత్రి చెప్పాలని ఆయన డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ‘‘ఇంత పెద్ద బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో నిరుద్యోగ భృతి ఇస్తున్నరా..? మూడెకరాల భూ పంపిణీ ఏమైంది..?’’ అని నిలదీశారు. 
సభను భట్టి పక్కదోవ పట్టిస్తున్నరు: హరీశ్​
సభను భట్టి విక్రమార్క పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. ‘‘అన్ని యూనివర్సిటీల్లో ఖాళీలు నింపడానికి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినం. పరీక్షలు, ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాక ఫలితాలు ఇచ్చే సమయంలో కొంతమంది కోర్టులకు వెళ్లడంతో స్టే వచ్చింది. ఈ స్టే ఆర్డర్‌‌‌‌‌‌‌‌తో తెలంగాణలోనే కాకుండా దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆగిపోయింది. దీనిపై కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తోంది” అని ఆయన  అన్నారు. యూనివర్సిటీల్లోని అన్ని ఖాళీలను నింపుతామని చెప్పారు. కార్పొరేషన్లకు ఇచ్చిన గ్రాంట్లను కూడా అప్పు కింద లెక్కగడతరా అని ప్రశ్నించారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకం ద్వారా రూ. 16 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నిరర్ధక ఆస్తులైన  రాజీవ్‌‌‌‌‌‌‌‌ స్వగృహ, హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు భూములులాంటి వాటిని తీసేసి, అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం నిధులు సమకూర్చుకుంటామని చెప్పారు. మైనింగ్‌‌‌‌‌‌‌‌లో కొత్త పాలసీ తేవాలనుకుంటున్నట్లు, మైన్స్‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌ రూపంలో తీసుకురావడం ద్వారా నాన్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూను కూడా పెంచుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. ‘‘ఎస్సీ సంక్షేమంపై వివిధ కార్యక్రమాలు చేస్తున్నం. ఆ కార్యక్రమాల్లో విద్యపై పెట్టిన ఖర్చును ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో కలిపి చూసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఖర్చు చేస్తే అది విద్యపై పెట్టినట్లు కాదా..? ఇది కచ్చితంగా విద్యపై ఖర్చు పెట్టినట్లుగా చూపిస్తం. ఆయా శాఖల ద్వారా ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఆయా శాఖల పద్దులో పొందుపరుస్తరు” అని హరీశ్​ అన్నారు.