కొత్త కాలేజీల ఏర్పాటుపై ఆసక్తి చూపని సర్కార్

కొత్త కాలేజీల ఏర్పాటుపై ఆసక్తి చూపని సర్కార్
  • 25 కాలేజీల కోసం ఇంటర్ కమిషనరేట్ ప్రపోజల్
  • లిస్టులో విద్యాశాఖ మంత్రి సెగ్మెంట్​లో 2 కాలేజీలు
  • ఇప్పటికీ ఏ ఒక్కదానికీ పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా సర్కారు జూనియర్ కాలేజీల ఏర్పాటుపై ప్రభుత్వం ఆసక్తి చూపించట్లేదు. తమ నియోజకవర్గంలో కాలేజీలు కావాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్నేండ్లుగా లెటర్లు పెడుతున్నా.. సర్కారు మాత్రం స్పందించడం లేదు. దీంతో పేద విద్యార్థులు దూర ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లక తప్పడంలేదు. రాష్ట్రంలో మొత్తం 405 సర్కారు జూనియర్ కాలేజీలుండగా,1.70 లక్షల మంది చదువుతున్నారు. కొత్త మండలాల ఏర్పాటు తర్వాత సర్కారు కాలేజీల ఏర్పాటుకు డిమాండ్ మరింత పెరిగింది.

ఇప్పటికీ పలు నియోజకవర్గాల్లో, పాత మండలాల్లోనూ సర్కారు కాలేజీలు లేవు. అసెంబ్లీలోనూ పలువురు ఎమ్మెల్యేలు తమ మండలాల్లో కాలేజీలను ఏర్పాటు చేయాలని జీరో అవర్​లో ప్రస్తావించారు. ఆ టైమ్​లో సర్కారు ఒకే చెప్తున్నా, ఏర్పాటు చేయడంలో మాత్రం శ్రద్ధ పెట్టట్లేదు. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిటికల్ పార్టీలు, స్టూడెంట్ యూనియన్ల నుంచి ఇంటర్ కమిషనరేట్​కు అనేక ప్రపోజల్స్​వస్తున్నాయి.
ప్రపోజల్స్ ​పక్కకే..
మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితో కాలేజీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పంపించాలని ఇంటర్ కమిషరేట్​కు సర్కారు పెద్దలు ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో 25 పైగా కాలేజీలు పెట్టాలని సర్కారుకు ఇంటర్ అధికారులు ప్రపోజల్స్​ పంపించారు. ఇవన్నీ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు రికమండ్ చేసిన కాలేజీలే కావడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో బీబీపేట, రాజంపేట, నిజాంసాగర్, పెద్దకొడపుగల్, నాగిరెడ్డిపేట, మహబూబ్​నగర్​ జిల్లాలో ఏడు కొత్త కాలేజీలు, మంచిర్యాలలో భీమారం, కోటపల్లి, హాజీపూర్, నాస్​పూర్, నల్గొండలో చిట్యాల, నార్కెట్​పల్లి, నాగర్​కర్నూల్​లో లింగాల, ఉప్పునూతల, రంగారెడ్డి జిల్లాలో బాలపూర్, జల్​పల్లి, శంకర్​పల్లి, ఖమ్మంలోని కూసుమంచి తదితర చోట్ల కొత్త కాలేజీలకు ప్రపోజల్స్​పంపించారు.

ఈలిస్టులో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సెగ్మెంట్​లోనూ 2 కొత్త కాలేజీలకు ప్రపోజల్స్ ఉన్నాయి. అయితే, ఈ ప్రపోజల్స్ అన్నింటినీ సర్కారు పక్కన పెట్టేసింది. ఇప్పటివరకు ఇందులో ఏ ఒక్క కాలేజీకి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో వచ్చే విద్యాసంవత్సరంలోనూ కొత్త కాలేజీలు ఏర్పడే అవకాశాలు కనిపించట్లేదు. కొత్త కాలేజీలు వస్తే అయినా పేద విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గుతాయని విద్యావేత్తలు, స్టూడెంట్ సంఘాల నేతలు చెప్తున్నారు.