హైదరాబాద్, వెలుగు:కరోనా కట్టడి కోసం త్వరలో మంత్రులతో ఓ కమిటీని వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ చైర్మన్‌గా.. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌తోపాటు మరో ఒకరిద్దరు మంత్రులు మెంబర్లుగా ఈ కమిటీని నియమించాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను కరోనాపై రివ్యూలు జరిపే ఆలోచనలో లేనట్టు ఇప్పటికే సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. వైరస్ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నా దానిపై కేసీఆర్ గత 18 రోజులుగా ఎలాంటి సమీక్షలు జరపలేదు. మంత్రులతో కమిటీని వేస్తే.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆ కమిటీనే మొత్తం ఫోకస్ పెట్టనుంది. గ్రేటర్హైదరాబాద్లో కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆగ్రహంలో ప్రజలు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్ అందినట్లు తెలిసింది. మంత్రుల కమిటీని వేసి, రంగంలోకి దింపితే ప్రజా వ్యతిరేకత నుంచి కూడా బయటపడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కేటీఆర్ కేంద్రంగా కరోనా రివ్యూలు?
మంత్రుల కమిటీలో కేటీఆర్ మెంబర్‌గా ఉండే అవకాశం ఉంది. కమిటీ ఏర్పాటైతే ఇక కేటీఆర్ కేంద్రంగా కరోనాపై రివ్యూలు జరగొచ్చని ఆఫీసర్లలో చర్చ నడుస్తోంది. మున్సిపల్ శాఖను చూస్తున్న కేటీఆర్.. హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్నా స్పందించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ విమర్శలను తిప్పికొట్టాలంటే మంత్రుల కమిటీలో కేటీఆర్‌కు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ఈటలకు సహకరించని ఆఫీసర్లు?
హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ కు ఆ శాఖలోని కొందరు ఆఫీసర్లు సహకరించడం లేదని ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఆయన ఇచ్చే సూచనలను పెద్దగా పట్టించుకోవడం లేదని, ఆయన పిలిచే రివ్యూలకు మొహమాటం కోసం వస్తున్నారే తప్ప, పూర్తి సమాచారంతో రావడంలేదని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో మంత్రి కూడా కొంత కాలంగా సీరియస్ గా దృష్టి సారించడం లేదని ఆ వర్గాలు అంటున్నాయి. పదిహేను రోజులుగా కరోనాపై ఈటల ప్రెస్ మీట్లు పెట్టడంలేదు.
తెలంగాణలో 40 వేలకు చేరువైన కరోనా కేసులు
