21 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారట

21 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారట

హైదరాబాద్, వెలుగుతెలంగాణ రాకముందు నుంచే నీళ్లు పారుతున్న 21 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు తాము నీళ్లందిస్తున్నట్టు సర్కారే గొప్పగా చెప్పుకుంది. తెలంగాణ స్టేట్‌‌‌‌ స్టాటిస్టికల్‌‌‌‌ అబ్‌‌‌‌స్ట్రాక్ట్‌‌‌‌ పేరుతో వివిధ శాఖల విజయాలతో కూడిన రిపోర్ట్​ను ప్రభుత్వం విడుదల చేసింది. సాగునీటి శాఖ విషయంలో మాత్రం ఇచ్చంత్రపు లెక్కలతో జనాన్ని మభ్య పెట్టడానికి పంచరంగులతో కూడిన చిత్రాలు చూపించింది. ఆరేండ్లలో 15 లక్షల ఎకరాలను మాత్రమే అదనంగా సాగులోకి తెచ్చామని చెప్పుకోలేక ఆపసోపాలు పడింది. ఉమ్మడి ఏపీలోని నాగార్జునసాగర్‌‌‌‌ ఎడమ కాలువ, ఎస్సారెస్పీ స్టేజ్‌‌‌‌–1, నిజాంసాగర్‌‌‌‌, అలీసాగర్‌‌‌‌, గుత్ప, జూరాల, ఆర్డీఎస్‌‌‌‌, కడెం, మూసీ ప్రాజెక్టుల కింద భూములకు నీళ్లందుతున్నాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టుల కింద 21.02 లక్షల ఎకరాల ఆయకట్టును కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వమే సాగులోకి తెచ్చినట్టుగా అబ్‌‌‌‌స్ట్రాక్ట్‌‌‌‌లో చెప్పుకుంది. ఆన్‌‌‌‌గోయింగ్‌‌‌‌ ప్రాజెక్టులైన ఏఎమ్మార్పీ, ఎస్సారెస్పీ స్టేజ్‌‌‌‌–2, దేవాదుల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, పెద్దవాగు, కోయిల్‌‌‌‌సాగర్‌‌‌‌, ఎల్లంపల్లి, వరద కాలువ, సింగూరు ప్రాజెక్టుల కింద 15.65 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని.. భక్తరామదాసు, ఎల్లంపల్లి, వరద కాలువ కింద 1.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని ప్రతిపాదించింది.

రాష్ట్రంలోని 33 మేజర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల కింద 89.30 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా అందులో 36.68 లక్షల ఎకరాలకు నీళ్లందుతున్నాయని పేర్కొంది. ఈ మొత్తం భూమిని తమ సర్కారే సాగులోకి తెచ్చిందన్నట్టుగా కలర్‌‌‌‌ ఇవ్వబోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 18,25,700 ఎకరాల భూమిని సాగులోకి తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించింది. ఇదే ప్రాజెక్టు నీళ్లతో ఇంకో 18,65,441 ఎకరాలను స్థిరీకరిస్తామని పేర్కొంది. ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌‌‌‌, సింగూరు ప్రాజెక్టుల కింద సాగులో ఉన్నట్టుగా పేర్కొన్న ఆయకట్టునే కాళేశ్వరం నీళ్లతో స్టెబిలైజ్‌‌‌‌ చేయబోతున్నామని చెప్పి అంకెలతో మాయ చేసే ప్రయత్నం చేసింది. అసలు పనులే మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల కింద 2 లక్షల ఎకరాలు, డిండి లిఫ్ట్‌‌‌‌ స్కీం కింద 3.61 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామని ప్రకటించింది.

మీడియం ఇరిగేషన్‌‌‌‌ కింద తెలంగాణ రాకముందే సాగులో ఉన్న 3.04 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చినట్టుగా చెప్పుకున్నారు. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీడియం ఇరిగేషన్‌‌‌‌ కింద సాగులోకి తెచ్చింది 59 వేల ఎకరాలు మాత్రమే. రాష్ట్రంలోని 635 లిఫ్ట్‌‌‌‌ స్కీమ్ కింద 4,50,303 ఎకరాలు, 37 మీడియం ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల కింద 4,01,654 ఎకరాలు, 44,672 చెరువుల కింద 18,44,891 ఎకరాలు, 33 మేజర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల కింద 89,30,015 ఎకరాల సాగు భూమి ఉన్నట్టుగా రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్నారు.