టీఆర్ఎస్లో రచ్చకెక్కుతున్న గ్రూపు రాజకీయాలు

 టీఆర్ఎస్లో రచ్చకెక్కుతున్న గ్రూపు రాజకీయాలు

వెలుగు, నెట్​వర్క్: జిల్లాల్లో రూలింగ్​ పార్టీ లీడర్ల మధ్య ఇన్నాళ్లూ సైలెంట్​గా నడిచిన గ్రూపు రాజకీయాలు ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న పలువురు నేతలు నియోజకవర్గాల్లో సిట్టింగ్​లకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు కాస్తా.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ప్రత్యర్థులుగా మారుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ రెండు వర్గాలుగా చీలిపోతున్న క్యాడర్ ​పరస్పరం బురదజల్లుకుంటున్నారు. ఇన్నాళ్లూ సోషల్​మీడియాలో తిట్టుకున్నవాళ్లు గల్లలు పట్టుకుంటున్నారు. 

వరంగల్​లో రచ్చ రచ్చ.. 

వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‍, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు మధ్య సైలెంట్‍ వార్‍ నడుస్తోంది. ఈ స్థానం నుంచి దయాకర్‍రావు తమ్ముడు ప్రదీప్‍రావు టికెట్​ ఆశించడమే వర్గపోరుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల స్టేట్ రోడ్‍ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ చైర్మన్‍గా మెట్టు శ్రీనివాస్‍ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రదీప్‍రావు వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నన్నపనేని అనుచరులు చింపివేయ డంతో ఇంటిపోరు రచ్చకెక్కింది. వరంగల్‍​లో టీఆర్ఎస్ రైతు సభ నిర్వహించగా ఎర్రబెల్లి వెళ్లిపోయాక మీటింగ్ కు అటెండ్ కావడం చర్చనీయాంశమైంది. మహబూబాబాద్‍లో ఎంపీ మాలోత్‍ కవిత, ఎమ్మెల్యే శంకర్‍నాయక్‍  కు పడడం లేదు. కొన్ని రోజుల కింద నిర్వహించిన రైతుసభలో కవిత  మాట్లాడుతుంటే శంకర్‍ నాయక్‍ మైక్‍ గుం జుకోవడం హాట్‍ టాపిక్‍ అయింది. ఎంపీ కవిత అనుచరుడు 8వ వార్డ్ కౌన్సిలర్‍ రవి నాయక్‍ మర్డర్  ఇద్దరి మధ్య గ్యాప్‍ పెంచింది. కవిత మానుకోట నుంచి టికెట్ ఆశిస్తున్నందునే శంకర్​నాయక్​ వర్గం టార్గెట్​ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

పట్నం వర్సెస్​ పైలెట్​.. 

వికారాబాద్​ జిల్లా తాండూరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి మధ్య పోరు పీక్స్​కు చేరుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి తామే కంటెస్ట్‌ చేస్తామని ఇద్దరు నేతలు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు. మూడేండ్లుగా వీరి మధ్య గ్యాప్‌ కొనసాగుతోంది. తాజాగా బయటికి వచ్చిన సీఐ ఆడియో క్లిప్పింగ్​ వీళ్ల పంచాయితీని మరోసారి బయటపెట్టింది. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్​రెడ్డి టీఆర్​ఎస్​లో చేరారు. ఓడిపోయిన మహేందర్​రెడ్డి తర్వాత లోకల్​బాడీస్​ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి సబితా రెడ్డి సాక్షిగా వేదికపైనే ఇద్దరు గొడవ పడ్డ సందర్భాలున్నాయి. 

నల్గొండలో మూడోచోట్ల వర్గపోరు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్​లో ఎమ్మెల్సీ కోటిరెడ్డికి, ఎమ్మెల్యే నోముల భగత్‌ కు మధ్య చిచ్చు రగులుతోంది. మంత్రి జగదీశ్​రెడ్డికి సన్నిహితుడైన కోటిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే సుప్రీం అని హైకమాండ్‌ చెప్పడంతో అభివృద్ధి పనులు, ఆఫీసర్ల బదిల్లీలో భగత్​ మాటే చెల్లుబాటవుతోంది. ఇది కోటిరెడ్డికి మింగుడుపడడంలేదు. తన సొంత మండలమైన తిరుమలగిరి ఎంపీపీ భగవాన్‌నాయక్‌ కు చెందిన కాంపౌండ్‌ వాల్‌ను అధికారులు కూల్చివేయడం కోటిరెడ్డికి కోపం తెప్పించింది. ఇటీవల ఇఫ్తార్‌ విందులో తమ నేతలతో కలిసి ఫొటో దిగే విషయంలో వారి అనుచరులు వేదిక వద్దే కొట్లాడుకున్నారు. నల్గొండలోనూ మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా రెండుగా విడిపోయారు. జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అనుచరుడు, మున్సిపల్​ కోఆప్షన్‌ మెంబర్‌ జమాల్‌ ఖాద్రీ, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అనుచరుడు, కౌన్సిలర్‌ ఖయ్యూం బేగ్‌ ఇటీవల కౌన్సిల్​ మీటింగ్‌లో నువ్వెంతంటే నువ్వెంత అంటూ తిట్టుకున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచే నకిరేకల్ లో మాజీ ఎమ్మెల్యే వీరేశంతో గొడవలు జరుగుతున్నాయి. మేడే సందర్భంగా నకిరేకల్‌ మెయిన్‌ సెంటర్‌లో వీరేశంకు పార్టీ మెంబర్​షిప్ ​లేదంటూ పార్టీ జెండా ఎగరేయకుండా లింగయ్య వర్గీయులు అడ్డుతగిలారు. గతంలో వీరేశం వర్గానికి సభ్యత్వ పుస్తకాలు కూడా ఇవ్వలేదు. దీంతో ఆయనతోపాటు  అనుచరులు కూడా ఆన్‌లైన్‌లో మెంబర్‌షిప్‌ కోసం అప్లై చేసుకున్నారు.

పాలమూరులోనూ ఇదే సీన్​.. 

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని  ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తన కొడుకు డాక్టర్​ అజయ్​ను వారసుడిగా రాజకీయాల్లోకి తేవడంపై పార్టీ లీడర్లు అసంతృప్తితో ఉన్నారు. అజయ్​ లోకల్​ లీడర్లకు సమాచారం ఇవ్వకుండా ఊళ్లలో పర్యటిస్తూ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఇసుక దందాలో ఇన్వాల్వ్​ కావడం, దళితబంధు తదితర ప్రభుత్వ పథకాల అమలులో స్థానిక లీడర్ల అభిప్రాయాలను తీసుకోకపోవడంపై పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్​రెడ్డి..జిల్లా మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​లకు ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్​లో మాజీ మంత్రి జూపల్లి  కృష్ణారావుకు, పార్టీ హైకమాండ్​కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటనకు కూడా జూపల్లికి  పిలుపు రాకపోవడం, అదే టైమ్​లో ఆయన  ఖమ్మం వెళ్లి  తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ప్లీనరీకి కూడా ఆహ్వానం అందలేదు. జూపల్లి  పార్టీ మారతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డితోనూ, బీజేపీ జాతీయ నేత అరుణతోనూ జూపల్లికి పాత గొడవలున్నాయి. దాంతో ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తిగా మారింది. జడ్చర్లలో వర్గ విభేదాలు బట్టబయలు కాకున్నా.. సోషల్​ మీడియాలో గ్రూపులు దర్శనమిస్తున్నాయి. పాలమూరు జిల్లా టీఆర్​ఎస్​అధ్యక్షుడు, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి అన్న కొడుకు మన్నె జీవన్​రెడ్డి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు.  వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి తానే క్యాండిడేట్​ అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని  లక్ష్మారెడ్డి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. నాగర్​కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి  మధ్య, కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య విభేదాలున్నాయి. కసిరెడ్డి కల్వకుర్తి టికెట్ ఆశిస్తుండగా.. కూచకుళ్ల నాగర్​కర్నూల్ టికెట్ తన కొడుకుకు  ఇప్పించుకోవాలని  ప్రయత్నం చేస్తున్నారు. 

ఖమ్మంలో మూడుముక్కలాట.. 

ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య పోరు తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి వ్యతిరేకంగా  సోషల్ మీడియాలో  కామెంట్లు చేశారంటూ  మాజీ మంత్రి తుమ్మల అనుచరుడు, మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. దీంతో తుమ్మల అనుచరులు రూరల్ పీఎస్​ ముందు ధర్నా చేశారు. భాస్కర్ కనిపించకుండా పోవడం, మూడు రోజుల తర్వాత అరెస్ట్ చేసినట్టు చూపించడం వెనుక ఎమ్మెల్యే  ఒత్తిడి ఉందని ఆరోపిస్తున్నారు. అంతకు ముందు కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో తుమ్మల వర్గీయుల మీద ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు అక్రమ కేసులు పెట్టారని కూడా ఆరోపిస్తున్నారు.