32 ఏండ్లలో ఈసారే పెద్ద వానలు

32 ఏండ్లలో ఈసారే పెద్ద వానలు

హైదరాబాద్, వెలుగు: ఈసారి వానలు దంచికొట్టాయి. దశాబ్దాల రికార్డును తిరగరాశాయి. ఈ సీజన్ లో 107.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1988 నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధిక వర్షపాతం. రాష్ట్రంలోకి జూన్ 6న నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, అప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడ్డాయి. తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) డేటా ప్రకారం ఈ సీజన్లో బుధవారం వరకు 72.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, ఏకంగా 107.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  అంటే సాధారణం కంటే 50శాతం అధికంగా వానలు పడ్డాయి. గడిచిన 32 ఏండ్లలో ఇంత పెద్ద వానలు ఎప్పుడూ పడలేదు. ఇంతకుముందు అత్యధికంగా 2016లో 91.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

82 రోజులు వానలు

ఈ సీజన్ లో మరో రికార్డు కూడా నమోదైంది. ఈసారి నాలుగు నెలల సీజన్ లో ఏకంగా 82 రోజులు వానలు పడ్డాయి. 1988 నుంచి ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఎప్పుడూ వానలు పడలేదు. 2010లో 81 రోజులు, పోయినేడు 77 రోజులు వానలు పడ్డాయి. ఇక ఈసారి హైదరాబాద్లో 50 రోజులు వర్షాలు కురిశాయి. 2010లో 51రోజులు వానలు పడగా, ఆ తర్వాత ఎక్కువ రోజులు వానలు పడడం ఇదే మొదటిసారి.

సెప్టెంబర్ లో 94 శాతం అధికం

ఈ సీజన్ లో ఒక్క సెప్టెంబర్ లోనే 94 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఆ నెలలో 12.78 సెంటీమీటర్ల వర్షపాతం అంచనా వేయగా, 24.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జూన్లో 34 శాతం, జులైలో 9 శాతం, ఆగస్టులో 78 శాతం అధికంగా వానలు పడ్డాయి. ఈసారి రాష్ట్రంలో అత్యధిక సగటు వర్షపాతం ఆగస్టు 15న 4.8 సె.మీ, ఆ తర్వాత సెప్టెంబర్ 26న 4.5 సె.మీ రికార్డయింది.

నిర్మల్, ఆదిలాబాద్ లో లోటు..

15 జిల్లాల్లో అతి భారీ, 12 జిల్లాల్లో భారీ, 6 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. వనపర్తిలో 150%  అధిక వర్షపాతం నమోదు కాగా, నిర్మల్లో -14%, ఆదిలాబాద్లో 10 % లోటు వర్షపాతం నమోదైంది.

రెండ్రోజులు వానలు

రాష్ట్రంలో రానున్న రెండ్రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లో వానలు పడ్డాయని తెలిపింది. ఖమ్మంలోని బూర్గంపాడు, కరీంనగర్లోని తిమ్మాపూర్లలో 8 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వాపురంలో 6, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, చంద్రుగొండ, ఖమ్మం అర్బన్లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయిందని చెప్పింది. రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ల నుంచి నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయాయని పేర్కొంది.