
హైదరాబాద్, వెలుగు : భూసేకరణ చేసినప్పుడు చట్ట ప్రకారం ఆర్‌ఆర్ ప్యాకేజీ (పునర్నిర్మాణం, పునరావాసం)లను మేజర్లుగా ఉన్న కుమార్తెల విషయంలో వివక్ష చూపడం తగదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. వారికి కూడా పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. భూసేకరణ నోటిఫికేషన్ 41(1) జారీ చేసేనాటికి తల్లిదండ్రులతో ఉన్న కూతుళ్లకు కూడా పరిహారం చెల్లించాలని జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా నాస్‌పూర్ మండలం తాళ్లపల్లిలో శ్రీరాంపూర్–2 బొగ్గు గనుల ఓపెన్ కాస్ట్‌గా మార్చే నిమిత్తం భూసేకరణకు నోటిఫికేషన్ వెలువడింది. మేజర్లుగా ఉన్న తమకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ తాళ్లపల్లికి చెందిన 78 మంది యువతులు హైకోర్టును ఆశ్రయించారు. 420 ఎకరాల సేకరణకు 2007లో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చామని, 2008లో అవార్డు కూడా ప్రకటించామని ప్రభుత్వ అడ్వకేట్ వాదించారు. జీవో 88 ప్రకారం ఆర్‌ఆర్ ప్యాకేజీ, 645 దినాలకు వేతనం, ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్న పిటిషనర్ల వాదన చెల్లదన్నారు. దీనిపై హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. సామాజిక ఆర్థిక సర్వే చేశామని ప్రభుత్వం చెబుతోందని, ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కలెక్టర్‌కు ఆర్డీవో లిస్ట్ పంపడాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం చెల్లదని తేల్చింది. కుమారులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేస్తూ మేజర్లుగా ఉన్న కూతుళ్లకు అమలు చేయకపోవడం వివక్ష చూపడమే అంది. జీవో 88 ప్రకారం మేజర్లుగా ఉన్న కుమార్తెలకు వీలైనంత త్వరగా పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.