అక్రమ లేఔట్లు వేస్తుంటే అప్పుడేం చేసిన్రు

అక్రమ లేఔట్లు వేస్తుంటే అప్పుడేం చేసిన్రు
  • చట్టాలను పక్కాగా అమలు చేసి  ఉంటే ఎల్ఆర్ఎస్ అవసరమేంటి?
  • క్రమబద్ధీకరణ ఎన్నిసార్లు?, చట్టాలను ఉల్లంఘించేలా ప్రభుత్వ చర్యలు
  • సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం.. 11వ తేదీ లోగా కౌంటర్ వేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ లేఔట్లు వేస్తుంటే ఆఫీసర్లు ఏం చేశారని ప్రశ్నించింది. ‘‘ప్రతి ఐదేళ్లకొకసారి ఎల్ఆర్ఎస్ వస్తుందనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇట్ల ఎన్నిసార్లు ఎల్ఆర్ఎస్ కు అనుమతి ఇస్తారు? ప్రజలు చట్టాలను ఉల్లంఘించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. చట్ట ప్రకారం లేఔట్లు వేద్దామని అనుకునేవాళ్లు కూడా.. వేయాల్సిన అవసరం లేదని అనుకునేటట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. చట్టాలను పక్కాగా అమలు చేసి ఉంటే ఎల్ఆర్ఎస్ అవసరమయ్యేదే కాదు కదా! అక్రమ లేఔట్లు వేస్తుంటే అధికారులు ఏం చేశారు. అలాంటి ఆఫీసర్లలో ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా? 111 జీవోలో ఏం చేశారు? ఒక్క అక్రమ నిర్మాణమైనా కూల్చారా? అధికారులంతా ఏం చేస్తున్నారు?” అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు ఆగస్టు 31న రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో 131ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫోరమ్‌‌ ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి, ఎ.సూర్యప్రకాష్, కేపీ రావ్‌‌లు ఫైల్ చేసిన పిల్స్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని, చిన్న వానలకే గ్రేటర్ లో వరదలు వస్తున్నాయని చీఫ్‌‌జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ కామెంట్ చేసింది. ఎల్ఆర్ఎస్ అవసరం ఎందుకొచ్చిందని, అసలు అక్రమ లేఔట్లు వేసినప్పుడే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది.

స్టే ఇవ్వండి…

పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ‘‘చెరువులు, కుంటలను లేఔట్లుగా మార్చడంతోనే గ్రేటర్ లో వరదలు వస్తున్నాయి. నాలాల విషయంలోనూ సర్కార్ నిర్లక్ష్యంగా ఉండడంతో నగరం మునిగిపోతోంది. మాస్టర్‌‌ ప్లాన్‌‌కు విరుద్ధంగా ఉన్న లేఔట్లను ఏ విధంగా క్రమబద్ధీకరిస్తారు? ఇదే జరిగితే  చట్టాలను ప్రభుత్వమే తుంగలో తొక్కినట్లు అవుతుంది. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా లేని అక్రమ లేఔట్లను క్రమబద్ధీకరిస్తే మరిన్ని కొత్త సమస్యలు తలెత్తుతాయి. అక్రమ లేఔట్లు వేస్తే మూడేళ్లు జైలు శిక్ష విధించాలని చట్టంలో ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయడం లేదు. పాలనాపరమైన జీవో జారీ చేసి క్రమబద్ధీకరణ చేయడానికి వీల్లేదు. ఐదేండ్లకోసారి ఎల్ఆర్ఎస్ జీవో ఇవ్వడం ప్రభుత్వానికి అలవాటైంది. గతంలో ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ ద్వారా వచ్చిన డబ్బులను ఆయా మున్సిపాల్టీలు, హెచ్‌‌ఎండీఏకు ఇస్తామని ఇవ్వలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లోనూ క్రమబద్ధీకరణకు జీవో ఇచ్చింది. తక్షణమే ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలి. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ముందుకెళ్లకుండా స్టే ఇవ్వాలి” అని సత్యంరెడ్డి
కోరారు.