- కోర్టులతో ఆటలొద్దు.. పెన్షన్ బకాయిలు మొత్తం చెల్లించాల్సిందే
- లేదంటే వ్యక్తిగత హాజరు తప్పనిసరి
- ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాకు హైకోర్టు అల్టిమేటం
హైదరాబాద్, వెలుగు: పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవు, సరెండర్ లీవు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి పదవీ ప్రయోజనాల చెల్లింపు వ్యవహారంలో కోర్టులతో ఆటలొద్దంటూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాను హైకోర్టు గురువారం హెచ్చరించింది. దాదాపు 758 మందికి చెల్లించాల్సి ఉండగా 221 మందికి మాత్రమే చెల్లించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో అవకాశం ఇస్తున్నామని జులై 10లోగా మొత్తం బకాయిలు చెల్లించి ప్రతి పిటిషనర్‌కు చెల్లించినట్టు నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
గడువు మంజూరు చేశామని అలుసుగా తీసుకోరాదని హితవు పలికింది. ఒక్క పిటి షనర్‌కు చెల్లించకపోయినా గత ఉత్తర్వుల ప్రకారం వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాలంటూ గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై దాఖలైన సుమారు 572కుపైగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఒక్కోటి పరిశీలిస్తూ రాగా మొత్తం 221 పిటిషన్లలో ఉత్తర్వులు అమలైనట్టు తేలింది. 3,656 టోకెన్‌లు జారీ చేశామని.. 1,056కు చెల్లింపులు జరిగాయని, మరో 2,600 టోకెన్‌లు చెల్లించాల్సి ఉందని ఏప్రిల్ 9లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంపై న్యాయమూర్తి ప్రశ్నించారు. 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెబుతున్నా పరిష్కారమైన పిటిషన్‌లను చూస్తే కేవలం 221 మాత్రమే ఉన్నాయని, టోకెన్‌లు జారీ అయినప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదని తెలిపారు.
రెగ్యులర్ ఉద్యోగులకు ఒక నెల జీతం ఆగినా పట్టించు కోమని పదవీ విరమణ చేసిన వారికి చెల్లించకపోతే అనుమతించే ప్రసక్తే లేదని,. అదేమీ ప్రభుత్వ సొమ్ము కాదని, వారి సొంత సొమ్ము అని, పెండ్లి, పిల్లల చదువులు వంటి అవసరాలకు దాచుకున్న సొమ్ము ఉపయోగపడటంలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల తర ఫు న్యాయవాదులందరూ ఇక్కడ లేరని, కొంత మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. 758లో 737 మందికి చెల్లించామని పేర్కొన్నారు.
