ఫామ్ హౌస్ కేసులో ప్రభుత్వ అప్పీల్ పై హైకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది. సిట్ దర్యాప్తు రద్దు చేసి సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం విచారణ జరపనుంది. ప్రభుత్వం, డీజీపీ, సిట్, సైబరాబాద్ సీపీ, మొయినాబాద్ పోలీసుల సంయుక్తంగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదుల్లో వ్యక్తిగత హోదాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తుషార్, నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజితో పాటు కేంద్ర ప్రభుత్వం, సీబీఐని ప్రభుత్వం ప్రతివాదులుగా చేర్చింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్ట్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐకీ కేసు బదిలీ నిలిపివేయాలని ఆ పిటీషన్ లో కోరింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు 2022 డిసెంబర్ 26న తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని ..ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికీ చెప్పకూడదన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని కామెంట్ చేశారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని తెలిపారు. దర్యాప్తు ఆధారాలను బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు.