పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండలో పోలీసుల రిహార్సల్స్‌‌

పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండలో  పోలీసుల రిహార్సల్స్‌‌

హైదరాబాద్, వెలుగు: పంద్రాగస్టు వేడుకల కోసం చారిత్రక గోల్కొండ కోట  ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా అధికార యంత్రాంగం, పోలీసులు రిహార్సల్స్‌‌ చేశారు. ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌‌తో కలిసి సీఎస్ సోమేశ్‌‌ కుమార్‌‌ శనివారం పరిశీలించారు. 15న ఉదయం పదిన్నరకు సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యి మంది కళాకారులతో సీఎంకు స్వాగతం పలుకనున్నారు. జెండా ఆవిష్కరణ తర్వాత పోలీస్ దళాలు రాష్ట్రీయ సెల్యూట్ అందిస్తాయి. కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక పాస్‌‌లను జారీ చేసింది. అక్కడికి వచ్చిన వారందరూ కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా ప్రత్యేక తెరలను ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకల కోసం గోల్కొండకు వచ్చే వారికి మంచి నీటి సౌకర్యం, వాటర్‌‌ ప్రూఫ్‌‌ టెంట్లు అందుబాటులో ఉంచుతున్నారు.

వజ్రోత్సవ వేడుకల ముగింపు ఏర్పాట్లు

22వ తేదీన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. ముగింపు వేడుకలకు కేసీఆర్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరిగే ఈ ముగింపు వేడుకలకు అన్ని జిల్లాల నుండి కనీసం 2వేల మంది చొప్పున పాల్గొంటారు. కార్యక్రమానికి వేదిక ఏర్పాట్లు, చేపట్టాల్సిన చర్యలు, హాజరయ్యే వారికి సదుపాయాలు, సీటింగ్, తదితర ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం మొత్తం కెపాసిటీ 30వేలుండగా, వీరికి కావాల్సిన సదుపాయాల కల్పనపై సమీక్షించారు. వజ్రోత్సవాల్లో భాగంగా 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో సమాజంలోని ప్రతి ఒక్కరు పొల్గొనాలని మంత్రులు శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ప్రతి రహదారిలో ట్రాఫిక్ నిలిపివేయడం జరుగుతుందన్నారు.