- లొంగిపోయేందుకు సిద్ధమైన మిలటరీ ప్లటూన్ కమాండర్ అన్వేష్
- కాల్చి చంపేసిన స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ సక్రు, అనుచరులు
- జనవరి 29న ఒడిశా రాష్ట్రంలో ఘటన
భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు తమ సహచర మిలటరీ ప్లటూన్ కమాండర్ అన్వేష్‌ను కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఒడిశా రాష్ట్రంలోని కందమాల్ జిల్లాలో జనవరి 29న జరిగిన గురువారం వెలుగుచూసింది. కందమాల్ ఎస్పీ హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం... ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన అన్వేష్కలహండి -కందమాల్ బౌద్ నయానగర్ డివిజన్ కమిటీ మెంబర్, మిలటరీ ప్లటూన్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా అన్వేష్ ఒడిశా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అతడి నిర్ణయం ఒడిశాలోని స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ (ఎస్‌జెడ్‌సీఎం) సుక్రు, అతడి అనుచరులు శీల, జగేశ్‌కు నచ్చలేదు. ఈ విషయంపై అన్వేష్‌కు, సక్రు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సుక్రు అన్వేష్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడు. తర్వాత అన్వేష్డెడ్బాడీని డారింగ్ బాడీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పకారీ రిజర్డ్వ్ ఫారెస్ట్‌లో పూడ్చిపెట్టారు.
కాగా, ఈ నెల 22న కందమాల్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుక్రు సహచరుడు, అన్వేష్ హత్యలో కీలకంగా వ్యవహరించిన జగేశ్ చనిపోయాడు. మావోయిస్టు సానుభూతిపరుల నుంచి వచ్చిన సమాచారం మేరకు కందమాల్ పోలీసులు కేసు నమోదు చేసి, మెజిస్ట్రేట్ సమక్షంలో అన్వేష్ డెడ్‌బాడీని బయటకు తీసి పంచనామా జరిపారు. లొంగిపోవడానికి సిద్ధమైన మావోయిస్టులను అగ్రనేతలు బెదిరిస్తున్నారని, మావోయిస్టుల్లో అభిప్రాయ భేదాలు తీవ్రంగా ఉన్నాయని ఎస్పీ హరీశ్ వివరించారు.
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. జాంగ్లా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నదీ పరివాహకంలో ఉన్న జైగూర్ డోడూం గ్రామాల అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారని సమాచారం అందడంతో డీఆర్జీ, బస్తర్‌ఫైటర్స్, ఎస్టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలు బుధవారం నుంచి కూంబింగ్ ప్రారంభించాయి. గురువారం ఉదయం ఆరు గంటల టైంలో జైగూర్, డోడూం గ్రామాల అడవుల్లో భద్రతాబలగాలు ఎదురుపడడంతో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాబలగాలు సైతం కాల్పులు మొదలుపెట్టాయి.
మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవిలోకి పారిపోయారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత భద్రాతాబలగాలు ఘటనాస్థలాన్ని పరిశీలించగా.. ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ రైఫిల్స్, 12 బోర్ తుపాకీ, గ్రెనేడ్, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు గాలిస్తున్నాయి. చనిపోయిన మావోయిస్టులు బైరంగఢ్ ఏరియా కమిటీ సభ్యులు హిచామా మడకం, మన్‌కీ పోడియంగా గుర్తించారు. వీరిద్దరిపై రూ.ఐదు లక్షల చొప్పున రివార్డులు ఉన్నట్లు ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు.
