ఏమిటా ప్లాన్ బీ? రేణుక వ్యాఖ్యల ఆంతర్యమేంటి..?

ఏమిటా ప్లాన్ బీ? రేణుక వ్యాఖ్యల ఆంతర్యమేంటి..?
  • ఏమిటా ప్లాన్ బీ
  • టికెట్లివ్వకుంటే ఏం చేస్తారు..?
  • కాంగ్రెస్ లో కమ్మ లీడర్ల లొల్లి
  • సైకిలెక్కి.. పచ్చజెండా ఎత్తేస్తారా?
  • రేణుకా వ్యాఖ్యల ఆంతర్యమేంటి
  • ఏఐసీసీకి అల్టీమేటం జారీ వెనుక..
  • హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లు ఆశిస్తున్న కమ్మ సామాజికవర్గం నాయకులు ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. తమకు తప్పకుండా టికెట్లు కేటాయించాల్సిందేనని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. సానుకూల స్పందన రాకుంటే తమ వద్ద ప్లాన్ బీ కూడా ఉందంటూ మాజీ ఎంపీ రేణుకాచౌదరి జాతీయ మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కమ్మ సామాజికవర్గ నేతల వద్ద ఉన్న ప్లాన్ బీ ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కమ్మ సామాజిక వర్గం టీడీపీ వెంట నడిచేది.. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడున్న లీడర్లు చాలా మంది బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు యాక్టివ్ గానే ఉన్నారు. బాన్సువాడ, శేరి లింగంపల్లి, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, జూబ్లీ హిల్స్, కుత్బుల్లాపూర్, సిర్పూర్ కాగజ్ నగర్, మేడ్చల్ తదితర స్థానాలకు కేటాయించాలనే డిమాండ్ ఆ సామాజిక వర్గం నుంచి వస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న చోట్ల సీట్లు కోరాలని కమ్మ సామాజికవర్గం నేతలు భావిస్తున్నారు. 

హస్తినలో మురళీధరన్ తో భేటీ..

కమ్మ సామాజిక వర్గానికి 12 సీట్లు కేటాయించాలని కోరుతూ ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ కమ్మ నేతల బృందం ఏఐసీసీ నేత, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తో భేటీ అయ్యింది. సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కో రారు. విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్యం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారని, బృందానికి నాయకత్వం వహించిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి చెప్పారు. రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటామని, ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమవుతామని ఆమె తెలిపారు. అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకుంటే తమ వద్ద ప్లాన్ బీ కూడా ఉందని చెబుతున్నారు. రేపు జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. 

సెకిలెక్కేస్తరా..?

తెలంగాణలో 119 సెగ్మెంట్లలో పోటీ చేయనున్నట్టు టీ టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదారు నెలల క్రితం ఖమ్మం, సికింద్రాబాద్ లలో బహిరంగసభలు నిర్వహించారు. బాలకృష్ణ టీటీడీపీ వ్యవహరాలను చూసుకుంటారని ప్రచారం ఊపందుకున్నది. చంద్రబాబు అరెస్టు తర్వాత హైదరాబాద్ లోనూ ఆందోళనలు జరిగాయి. కమ్మ సామాజిక వర్గం ఓట్లను రాబట్టుకుంటే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ నేతలు హస్తినలో తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్లాన్ బీలో భాగంగా గతంలో టీడీపీ ఎంపీగా పనిచేసిన రేణుకా చౌదరి తిరిగి ఆ పార్టీవైపు అడుగులు వేస్తారా..? తమకు పట్టున్న నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేసే ఉద్దేశం ఆమె మాటల వెనుక ఉన్నదా అన్న చర్చ మొదలైంది.