డీసీసీ అధ్యక్షులకు టికెట్ల గండం

డీసీసీ అధ్యక్షులకు టికెట్ల గండం
  • డీసీసీ అధ్యక్షులకు టికెట్ల గండం
  • 13 చోట్ల నుంచి పోటీకి సిద్ధమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
  • వీరితో పాటు టికెట్ల కోసం పోటీపడుతున్న సీనియర్ నేతలు
  • ఇప్పటికే మెదక్, మేడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ల రాజీనామా
  • జాబితా ప్రకటిస్తే ఏమవుతుందో..? ఎవరు పార్టీని వీడుతారో..?
  • రెబల్ గా పోటీ చేస్తే ఎలా..? ఆందోళనలో కాంగ్రెస్ అధిష్టానం! 

హైదరాబాద్ : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు టికెట్ల గుబులు పట్టుకుంది. ఏండ్ల తరబడి పార్టీకోసం పనిచేస్తున్న తమను కాదని ఫ్లైట్ లో వచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. మల్కాజ్ గిరి టికెట్ ను ఆశించిన డీసీసీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ భంగపడ్డారు. మల్కాజ్ గిరి టికెట్ ను బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు కేటాయిస్తుండటంతో ఆయన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

మెదక్ టికెట్ ఆశించిన మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కూడా టికెట్ ను మైనం పల్లి రోహిత్ ఇస్తున్నట్టు తెలియడంతో రాత్రి రాత్రే పార్టీ మారారు. ఈ పరిణామాలు మిగతా డీసీసీల అధ్యక్షులను వెంటాడుతున్నాయి. ఆదిలాబాద్ టికెట్ ను డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆశిస్తున్నారు. ఆ స్థానం నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఓ దశలో ఆయనకు టికెట్ ఖరారైందన్న వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండటం గమనార్హం.

జనగామ టికెట్ ను డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇదే స్థానం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఇద్దరు ముఖ్యనేతలే కావడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న మీమాంస స్క్రీనింగ్ కమిటీని వెంటాడుతున్నది. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన బరిలోకి దిగాలనుకున్న ముషీరాబాద్ సెగ్మెంట్ నుంచి అనిల్ కుమార్ తండ్రి అంజన్ కుమార్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయన సైలెంటయ్యారు.

ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారు.. ఇస్తే మరొకరు అలకబూనితే ఎలా..? అనే సందేహం హస్తం పెద్దలను వెంటాడుతున్నది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు టికెట్ ఆశిస్తున్నారు. అదే స్థానం నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ ఆరేపల్లి మోహన్ బరిలోకి దిగాలనుకుంటున్నారు. వీళ్లిద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

వరంగల్ డీసీసీబీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ తూర్పు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ ఆశిస్తున్నారు. సురేఖకు దాదాపుగా ఖరారైపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ టికెట్ రేసులో ఉ న్నారు. ఆయన ఖమ్మం స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ సీటు కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి పాలేరు, మరొకరికి ఖమ్మం సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే దుర్గా ప్రసాద్ అలకబూనే అవకాశం ఉంది. ఆయనను బుజ్జగించడం ఇప్పుడు అధిష్టానం ముందున్న పెద్ద టాస్క్.

నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి ముదిరాజ్ మక్తల్ టికెట్ ఆశిస్తున్నారు. ఇందుకోసం ఆయన తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదే స్థానాన్ని ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సీత దయాకర్ రెడ్డి కుమారుడు కోరుతున్నారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ టికెట్ ఆశిస్తున్నారు. ఇందుకోసం తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదే స్థానంపై సీనియర్ నాయకులు జంగా రాఘవరెడ్డి, వేం నరేందర్ రెడ్డి కన్నేశారు. వీళ్లిద్దరూ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.

నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం బాల్కొండ నుంచి బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బాల్కొండ టికెట్ ఇస్తామన్న హామీతోనే పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే దశాబ్దాల పాటు పార్టీకి సేవలు చే సిన తన పరిస్థితి ఏమిటనే ఆందోళన మోహన్ రెడ్డిలో వెంటాడుతోంది.

మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు జీ మధుసూదన్ రెడ్డి దేవరకద్ర టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్థానం నుంచి ప్రదీప్ గౌడ్ బలంగా ప్రయత్నిస్తున్నారు. మక్తల్ లో పోటీకి అవకాశం దక్కని పక్షంలో దేవరకద్ర టికెట్ నైనా తన కుమారుడికి కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. మరో కీలకమైన జిల్లా పెద్దపల్లి. ఈ జిల్లాలోని కీలకమైన రామగుండం స్థానాన్ని డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచే కాంగ్రెస్ సీనియర్ నేత జనక్ ప్రసాద్, మరో నాయకులు వేణుగోపాల్ పోటీ చేయాలని భావిస్తున్నారు. వీరిలో టికెట్ ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కత్తిమీద సామే..

సామాజిక సమీకరణాలు, సర్వేలు, దశాబ్దాలుగా పార్టీకి పనిచేసిన వారిని, గెలిచే అభ్యర్థులను బేరీజు వేసుకొని టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి పెద్ద సవాలుగా మారింది. టికెట్ దక్కని వాళ్లు రెబల్ గా బరిలోకి దిగినా.. ప్రత్యర్థి పార్టీలో చేరి పోటీ చేసినా ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుందన్న భయం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను వెంటాడుతున్నది. ఇప్పటికే ఇద్దరు డీసీసీ అధ్యక్షుడు రాజీనామాలు చేసిన నేపథ్యంలో ప్రతి అంశాన్నీ స్క్రీనింగ్ కమిటీ నిశితంగా పరిశీలిస్తున్నదని తెలుస్తోంది. జాబితా బయటికి వచ్చాక ఎంత మంది పార్టీ మారతారు..? ఎవరెవెరు రెబల్ గా నిలబడతారు అనేది తేలనుంది.