వర్షాలతో స్తంభించిన జన జీవనం

వర్షాలతో స్తంభించిన జన జీవనం

హైదరాబాద్, వెలుగు: ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం స్తంభించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏ రోజుకారోజు వచ్చే కూలి డబ్బులపై ఆధారపడి బతికేటోళ్లకు పనుల్లేక పస్తుండాల్సిన పరిస్థితి నెలకొంది. వీరంతా 5 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారాలు చేస్తూ.. కుటుంబాలను పోషించుకునేవారికి గిరాకీ లేక విలవిల్లాడుతున్నారు. 20, 30 ఏండ్లలో ఎన్నడూ ఇలా ఇన్ని రోజులు ముసురుపడడం చూడలేదంటున్నారు. 

ఇండ్లకే పరిమితమైన లక్షలాది కుటుంబాలు

9వ తేదీ నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావట్లేదు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. చిన్న పరిశ్రమలు మూతపడటంతో కార్మికులు ఇళ్లకే పరిమితం అయ్యారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలు ఉపాధికి దూరమయ్యారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్​కు వచ్చిన 8లక్షల మంది కూలీలకు పనిలేక అల్లాడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో జనం పెద్దగా బయటికి రాకపోవడంతో రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. రోడ్ల వెంట పూలు, పండ్లు, టీ, టిఫిన్, జ్యూస్​ అమ్ముకునే వ్యాపారులకు గిరాకీ లేకుండా పోయింది. అలాగే గ్రామాల్లోనూ కురుస్తున్న వర్షాల కారణంగా వ్యవసాయ పనులు నిలిచిపోవడంతో రైతులు, కూలీలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.