ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ గుడ్డిగా పనిచేస్తోందా..? సామాన్యులను వెంటాడుతున్న మిస్ సెల్లింగ్

ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ గుడ్డిగా పనిచేస్తోందా..? సామాన్యులను వెంటాడుతున్న మిస్ సెల్లింగ్

బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ల వంటి వాటిపై నమ్మకంతోనే ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు.  కానీ ఈ వ్యవస్థల వెనుక ఉన్న రెగ్యులేటర్లు, వారి పనితీరుపై అనుమానాలు కలగడం సహజం.  ప్రత్యేకించి ఇన్సూరెన్స్ రంగంలో.. ప్రజలు తరచుగా పాలసీలను కొనుగోలు చేయడానికి వెనుకాడుతుంటారు.  దీనికి కారణాలను చూస్తే ఉత్పత్తి సంక్లిష్టత, అవగాహన లోపం, ఏజెంట్లు, బ్యాంకుల మిస్ సెల్లింగ్ వంచి చాలా ఇబ్బందులు పాలసీహోల్డర్లను వెంటాడుతున్నాయి. 

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమతో పోలిస్తే.. ఇన్సూరెన్స్ రంగం ఇంకా వెనుకబడే ఉంది.  మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో సెబి  నియంత్రణ, పారదర్శకత, తక్కువ ఖర్చులు వంటివి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.  కానీ ఇన్సూరెన్స్ రంగంలో ట్రాన్స్పరెన్సీ లేమి, సంక్లిష్టమైన కమిషన్లు, తప్పుడు అమ్మకాలు వంటివి ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుతున్నాయి.  IRDAI నివేదికల ప్రకారం.. దేశంలో ఇన్సూరెన్స్ రీచ్ ప్రపంచ యావరేజ్ కంటే తక్కువగా ఉంది.  అంటే ప్రజలు పాలసీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది.

పాలసీలను ఎన్ని అమ్ముతున్నాం అనేది కాకుండా.. ఎంతమంది వాటిని 5 ఏళ్ల తర్వాత కూడా కొనసాగిస్తున్నారనేది ముఖ్యం.  పర్సిస్టెన్సీ నిష్పత్తి 50-60% మాత్రమే ఉండటం అంటే.. ప్రజలు తమ అవసరాలకు తగిన పాలసీలు కాదని తెలుసుకుని, ముందుగానే నిలిపివేస్తున్నారని అర్థం. ఇది వ్యవస్థలోని లోపాన్ని సూచిస్తుంది.  అన్యాయమైన వ్యాపార పద్ధతుల పై ఫిర్యాదులు పెరుగుతూనే ఉన్నాయని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డేటా చెబుతోంది. ఇందులో చాలా వరకు పాలసీల మిస్ సెల్లింగ్ కి సంబంధించినవే కావటం ఆందోళనకరంగా మారింది. 

బ్యాంకులు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉత్పత్తుల అమ్మకాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.  సిబ్బందిపై పాలసీలను అమ్మాలనే ఒత్తిడి కూడా భారీగానే పెరుగుతోంది.  దీనివల్ల తప్పుడు అమ్మకాలు పెరుగుతున్నాయి.  RBI తప్పుడు అమ్మకాలను నియంత్రించడానికి కొత్త నియమాలను రూపొందించినా, IRDAI ఇంకా తగిన చర్యలు తీసుకోవడం లేదు.  బ్యాంకులు ఇన్సూరెన్స్ సంస్థలతో జతకట్టి కార్పొరేట్ ఏజెంట్ల ద్వారా పాలసీలను అమ్ముతున్నాయి.  ఈ కార్పొరేట్ ఏజెంట్లు.. పర్సనల్ ఏజెంట్ల కంటే ఎక్కువ ప్రీమియంలను వసూలు చేస్తున్నారు.  ఇది తప్పుడు అమ్మకాలకు దారితీస్తోంది.

రెండు రెగ్యులేటర్లుRBI, IRDAI మధ్య స్పష్టత లేకపోవడం వల్ల.. ఇన్సూరెన్స్ ఉత్పత్తుల మిస్ సెల్లింగ్ పై చర్యలు తీసుకోవడం కష్టమవుతోంది.  ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి.  మొదటి సంవత్సరం కమిషన్లను తగ్గించి.. వాటిని పాలసీ కొనసాగినంత కాలం అందించేలా చర్యలు తీసుకోవాలి.  ఏజెంట్లు ఎంత కమిషన్ పొందుతున్నారో రివీల్ చేయాలి.  ఇవి ఇన్సూరెన్స్ రంగంలో పారదర్శకతను పెంచుతాయి. ఇలాంటి తప్పుడు పద్ధతులపై రెగ్యులేటరీ సంస్థ IRDAI చర్యలు తీసుకోకపోతే.. అది కేవలం పేపర్ టైగర్ గానే మిగిలిపోతుందని నిపుణులు అంటున్నారు. ఐఆర్డీఏఐ పేపర్ మీద కాకుండా పనిలో టైగర్ లా మారాలని వారు కోరుకుంటున్నారు.