హైదరాబాద్ దగ్గరే ఆగిపోయిన రుతుపవనాలు..వెస్టర్లీస్, ఈస్టర్లీస్ మధ్య ఫైట్ లాంటి పరిస్థితి

హైదరాబాద్ దగ్గరే ఆగిపోయిన రుతుపవనాలు..వెస్టర్లీస్, ఈస్టర్లీస్ మధ్య ఫైట్ లాంటి పరిస్థితి


మామూలుగా అయితే రుతుపవనాలు జూన్​ 1 నాటికి కేరళ తీరం నుంచి దేశంలోకి ప్రవేశించి.. జులై తొలి వారం నాటికే దేశవ్యాప్తంగా విస్తరిస్తుంటాయి. కానీ, ఈ సారి రుతుపవ నాలు ఈ నెల 4న కేరళలోకి ప్రవేశించాయి. తొలి రెండు మూడు రోజులు చాలా వేగంగా దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు విస్తరించాయి. మన రాష్ట్రంలోకి ఈ నెల 8న ప్రవేశించాయి. గద్వాల, నారాయణపేట జిల్లాల మీదుగా రాష్ట్రంలోకి వచ్చినా.. మూడు రోజులు స్తంభిం చిపోయాయి. మళ్లీ ఈ నెల 12న సెంట్రల్​, తూర్పు జిల్లాలకు విస్తరించాయి. అంతే, ఆ రోజు నుంచి మళ్లీ అంగుళం కూడా రుతుప వనాలు ముందుకు కదల్లేదు. రుతుపవనాల విస్తరణకు కీలకమైన నార్త్​ పాయింట్​ రాష్ట్రంలో ని భద్రాచలం, హైదరాబాద్​ మీదుగా వెళ్తున్నా..  మరింత ముందుకు కదిలేందుకు మాత్రం అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాలంటే మరో ఐదు రోజులైనా పడుతుందని వివరిస్తున్నారు.

 రుతుపవనాల విస్తరణకు అంతా అనుకూలంగా ఉందని వాతావరణశాఖ చెప్తూ వచ్చినప్పటికీ  ఒక్కసారిగా సీన్​ మారిపోయింది. పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందని  ఐఎండీ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు రకాల గాలుల మధ్య టగ్​ ఆఫ్​ వార్​ లాంటి పరిస్థితులు నెలకొనడంతో రుతుపవనాల విస్తరణపై ప్రభావం పడుతున్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పడమటి నుంచి తేమను మోసుకొచ్చే పశ్చిమ గాలులు, వర్షాలు కురిపించేందుకు అనువుగా ఉండే తూర్పు గాలుల మధ్య ‘తోపులాట’ లాంటి పరిస్థితులే ఇందుకు కారణమంటున్నారు. పశ్చిమగాలులు పూర్తిగా దక్షిణంవైపు వచ్చేశాయని, సాధారణ స్పీడ్​ కన్నా ఎక్కువ వేగంతో ముందుకు కదులుతున్నాయని వివరిస్తున్నారు. అదే సమయంలో రుతుపవనాల విస్తరణకు తోడ్పాటునిస్తూ, ఎక్కువ వర్షాలకు కారణమయ్యే తూర్పు గాలుల దిశను వేగంగా వస్తున్న పశ్చిమ గాలులు అడ్డుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

రుతుపవనాలను బలపరిచి.. దేశవ్యాప్తంగా వర్షాలు కురిసేలా తూర్పుగాలులు పనిచేస్తుంటాయి. ప్రస్తుతం పశ్చిమగాలులు తూర్పు పవనాలను అడ్డుకుంటుండడంతో.. తూర్పు పవనాల ప్రభావం కనిపించడం లేదు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో సరిపోయేంత తేమ ఉన్నా కూడా.. వెస్టర్లీస్​, ఈస్టర్లీస్​ మధ్య నెలకొన్న ‘ఫైట్​’ లాంటి పరిస్థితులతో రుతుపవనాలు ముందుకు కదలడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.