కట్నం ఇవ్వాల్సి వస్తుందనే కవల ఆడపిల్లల హత్య

కట్నం ఇవ్వాల్సి వస్తుందనే కవల ఆడపిల్లల హత్య
  •     నాలుగు రోజుల కింద కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన 
  • చిన్నారుల హత్య మిస్టరీని చేధించిన పోలీసులు
  •     తండ్రితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ముడు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ క్రైం, వెలుగు :  కరీంనగర్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఇటీవల జరిగిన కవల ఆడపిల్లల హత్య చేసిన కేసు మిస్టరీ వీడింది. ఆడ పిల్లలు అయినందున భవిష్యత్తులో కట్నం ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో తండ్రే పిల్లలిద్దరినీ బావిలో పడేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. పిల్లల హత్య కేసులో తండ్రితో పాటు అతడికి సహకరించిన ముగ్గురు కుటుంబ సభ్యులను కరీంనగర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించి వివరాలను సీపీ గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం సోమవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని జూబ్లీనగర్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న కచ్చు శ్రీశైలం ఓ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన  మౌనికతో 2020లో వివాహమైంది. వీరికి 2022లో కవల ఆడపిల్లలు గీతంశి, గీతన్వికలు జన్మించారు. అయితే మగ పిల్లవాడు కావాలని కోరుకున్న శ్రీశైలానికి ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు. పైగా ఆడపిల్లల పెండ్లిళ్లకు కట్నం ఇవ్వాల్సి వస్తుందని భావించిన శ్రీశైలం తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకేశ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఇద్దరు ఆడ పిల్లలను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 3న శ్రీశైలం తన భార్యను ఇంట్లోనే ఉండమని చెప్పి, ఇద్దరు కుమార్తెలను బైక్‌‌‌‌‌‌‌‌పై పొలం వద్దకు తీసుకెళ్లి బావిలోకి తోసేశాడు. 

గీతంశి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా.. తనే బావిలోకి దిగి చిన్నారిని నీటిలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా పిల్లలను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా నటిస్తూ కేకలు వేశాడు. చుట్టు పక్కల పొలాల వద్ద ఉన్న వారు వచ్చి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని తాళ్ల సాయంతో బావిలోకి దిగి ముగ్గురినీ పైకి తీసుకొచ్చారు. కాగా, శ్రీశైలం ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టగా.. తండ్రే హత్య చేసినట్లు తేలింది. దీంతో శ్రీశైలం కోసం గాలించగా.. గోపాల్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. పిల్లల హత్యకు సహకరించిన శ్రీశైలం తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకేశ్‌‌‌‌‌‌‌‌ను సైతం అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. నిందితుడి నుంచి బైక్‌‌‌‌‌‌‌‌, మొబైల్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న రూరల్‌‌‌‌‌‌‌‌ ఏసీపీ విజయకుమార్‌‌‌‌‌‌‌‌, సీఐ నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డిని సీపీ 
అభినందించారు.