ముగిసిన నారసింహుడి ఉత్సవాలు

ముగిసిన నారసింహుడి ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నారసింహుడి జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. యాదగిరిగుట్ట, పాతగుట్ట ఆలయాల్లో ఈ నెల 13న ప్రారంభమైన ఉత్సవాలకు ఆదివారం పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకం, నృసింహ జయంతి, నారసింహ ఆవిర్భావ ఘట్టంతో పరిసమాప్తి పలికారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా జరిపారు. టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి స్వామివారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారంతో జయంతి ఉత్సవాలు పరిసమాప్తం కావడంతో.. సోమవారం నుంచి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలు తిరిగి షురూ కానున్నాయి. యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. భక్తులు నిర్వహించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.30,06,220 ఆదాయం వచ్చింది. 

లక్ష్మి పుష్కరిణిలో పడి బాలిక మృ-తి

ప్రమాదవశాత్తు గుండం(లక్ష్మి పుష్కరిణి)లో పడి ఓ బాలిక మృతిచెందింది. యాదగిరిగుట్ట ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ గుడిమల్కాపూర్ కు చెందిన బొంతల రోజా(15) ఫ్యామిలీతో కలిసి స్వామివారి దర్శనం కోసం ఆదివారం యాదగిరిగుట్టకు వచ్చింది. స్నానం చేయడం కోసం గుండంలోకి దిగిన బాలిక ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు బయటకు తీసి 108కు ఫోన్ చేశారు. వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే బాలిక చనిపోయిందని చెప్పారు.