- విద్యుత్‌ను ప్రైవేటీకరించే కుట్ర: బీఆర్ఎస్ ప్రతినిధులు
- రైతుల నోట్లో ఎండ్రిన్ పోసినట్టే: టీఆర్ఎస్ చీఫ్ కవిత
- డిస్కంలను అప్పులకుప్పలుగా మార్చిన వాళ్లే రైతు డిస్కంపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు: ఎంపీ చామల
- మోటార్లకు మీటర్లు పెడితే మమ్మల్ని ఉరేయండి: ప్రభుత్వ విప్ దయాకర్
- వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు: కోదండరెడ్డి
- 24 గంటల కరెంట్‌ను ఎత్తేస్తరు: హరీశ్‌రావు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం.. సర్దిచెప్పిన ఈఆర్సీ చైర్మన్
- రైతు డిస్కంపై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయానికి క్వాలిటీ కరెంట్ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామని సీఎండీ ముషారఫ్ అలీ చెప్పగా, -ఇది విద్యుత్‌రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర అని బీఆర్ఎస్ ప్రతినిధులు ఆరోపించారు. ఈ నిర్ణయం రైతుల నోట్లో ఎండ్రిన్ పోసినట్టేనంటూ టీఆర్ఎస్ చీఫ్ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిస్కంలను అప్పుల కుప్పలుగా మార్చిన వాళ్లే రైతు డిస్కంపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) చైర్మన్ డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని విద్యుత్ నియంత్రణ భవన్‌లో రైతు డిస్కంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఆ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ , కాంగ్రెస్ తరఫున భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ అద్దంకి దయాకర్, బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత, వివిధ సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల లీడర్లు, ఎన్జీవో మెంబర్స్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొని తమ వాదనలు వినిపించారు.
కాగా, వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ముందుగా ఈఆర్సీ చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ.. రైతు డిస్కం ఏర్పాటుపై 33 మంది నుంచి అభ్యంతరాలు వచ్చాయని వెల్లడించారు. ముందుగా రైతు డిస్కం ఏర్పాటు లక్ష్యాలను ప్రజలకు వివరించాలని ఆ సంస్థ సీఎండీని ఈఆర్సీ చైర్మన్ ఆదేశించారు.
- ఉచిత కరెంట్‌ను ఎత్తేసేందుకే రైతు డిస్కం: మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి
ఉచిత కరెంట్‌ను ఎత్తేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నదని మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు రూపొందించిన కుట్రలో ఇది భాగమని అన్నారు. రైతు డిస్కం పేరుతో ఏర్పాటు చేస్తున్న సంస్థ రైతులను చీకట్లలోకి నెట్టే ‘ఉరి డిస్కం’ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల పేరుతో కరెంట్ దొంగతనాలు జరుగుతున్నాయని ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రైతాంగాన్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నమని మండిపడ్డారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై మోపిన ముద్రను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునరావృతం చేస్తోందని విమర్శించారు. ఈఆర్సీ నుంచి లైసెన్స్ అనుమతి రాకముందే సీఎం రేవంత్ మూడో డిస్కం ప్రారంభ తేదీని ప్రకటించడం నియంత్రణ సంస్థల అధికారాలను అవమానించడమేనని చెప్పారు. తెలంగాణ రైతాంగ భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్న రైతు డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. లైసెన్స్ ఇవ్వకుండా ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని ఈఆర్సీ చైర్మన్‌కు మాజీ మంత్రులిద్దరూ విజ్ఞప్తి చేశారు.
- అప్పుల కుప్పలుగా మార్చింది వాళ్లే: ఎంపీ చామల
రాష్ట్రంలో విద్యుత్ డిస్కంలను అప్పుల కుప్పలుగా మార్చిన వాళ్లే ఇప్పుడు రైతు డిస్కంపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధికోసం బీఆర్‌ఎస్, టీఆర్ఎస్ పార్టీలు రైతు డిస్కంను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఇది కేవలం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన డిస్కంం అని వివరించారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో దేశంలో 9వ స్థానంలో ఉన్న సదరన్ డిస్కమ్ 52వ స్థానానికి, నార్తర్న్ డిస్కమ్ 16 నుంచి 42వ స్థానానికి పడిపోయాయన్నారు.
2014కి ముందు రూ.1,595 కోట్లు ఉన్న బకాయిలను కేసీఆర్ సర్కారు రూ.31,698 కోట్లకు పెంచిందని చెప్పారు. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుపైనే రూ.15 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. కేంద్రం అమలు చేస్తునన ఆర్‌డీఎస్ఎస్ ప్రోగ్రామ్‌లో రైతుల మోటార్ల దగ్గర స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఎక్కడా లేదన్నారు. అయినా బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో రైతులను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
యాదాద్రి, భద్రాద్రి పవర్ప్లాంట్లను గడువులోగా నిర్మిస్తే రాష్ట్రానికి వేల కోట్ల నిధులు మిగిలేవన్నారు. గతంలో పోల్చితే రాష్ట్రంలో రెండేండ్లలోనే 3 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన రైతు డిస్కమ్‌కు లైసెన్స్ మంజూరుచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ సభ్యులు కె.రఘు, సీ. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
- అప్పులతో ఏర్పాటు చేసే డిస్కంతో ప్రయోజనం లేదు: కవిత
రైతు డిస్కం వస్తే రైతుల నోట్లో ఎండ్రిన్ పోసినట్టేనని టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతు డిస్క్ం పేరుతో రైతులపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని చెప్పారు. నిజంగా రైతులకు మంచి చేసే నిర్ణయమే అయితే ఎందుకు సీక్రెట్‌గా ఉంచారని కవిత ప్రశ్నించారు. డిస్కంలకు వేల కోట్ల బకాయిలు పెట్టి ద్రోహం చేసింది ప్రభుత్వమే అని పేర్కొన్నారు. 25 వేల కోట్ల అప్పులతో ఏర్పడే ఈ డిస్కం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, తెలంగాణ రైతాంగం భవిష్యత్‌ను ఆగం చేసే ఈ ప్రపోజల్‌ను ఈఆర్సీ రిజెక్ట్ చేయాలని కోరారు.
ఒక వేళ డిస్కంకు లెసెన్స్ ఇస్తే.. ప్రతి రైతు వద్దకు వెళ్లి ప్రభుత్వ మోసపూరిత నిర్ణయాలను వాళ్లకు వివరిస్తామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఈ అంశంపై ఇలా ఏసీ రూముల్లో నాలుగు గోడల మధ్య చర్చించి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. మొత్తం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ పబ్లిక్ హియరింగ్‌లు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘విద్యుత్ శాఖలో ఇప్పటికే 1,700 ఆంధ్రా ఉద్యోగులు అక్రమంగా వచ్చి రాష్ట్రంలో తిష్టవేశారు. వీరివల్ల 1,200 మంది తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు రాక నష్టపోయారు. ఇప్పుడు రైతు డిస్కంలో ప్రమోషన్లు ఇస్తున్నారని వాళ్లే మళ్లీ అప్లయ్ చేసుకున్నారు. డిస్కంలో ఆంధ్రావాళ్ల పెత్తనం ఎంతగానో పెరిగింది’’ అని కవిత పేర్కొన్నారు.
- మోటార్లపై మీటర్లు పెడితే మమ్మల్ని ఉరేయండి: అద్దంకి
రైతు డిస్కమ్ తీసుకొచ్చి మోటార్లపై మీటర్లు పెడితే మమ్మల్ని ఉరేసి చంపేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ అద్దంకి దయాకర్అన్నారు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, వాళ్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతు అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే రైతులు అని చెప్పారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు రైతు డిస్కమ్ ఏర్పాటుపై అబద్ధాలు ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు.
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయానికి అందించే కరెంట్ వైర్లలో 24 గంటల పాటు కరెంట్ రావాలి.. కానీ రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుంది.. 3 గంటలపాటు మోటార్లు నడుపుకున్నా ఆయకట్టు చివరికి నీళ్లు అందుతాయి’’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఓవైపు ప్రజాభిప్రాయసేకరణ జరుగుతుండగానే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. ‘‘గత ప్రభుత్వం ఎవరికి మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేది. రైతుల పక్షాన మాట్లాడటానికి వెళ్తే నన్ను, దొంతి నర్సింహారెడ్డిలాంటి రైతు సంఘాల లీడర్లను లోపలికి కూడా అడుగుపెట్టనియ్యలే. పోలీసులతో అరెస్ట్ చేయించేటోళ్లు’ అని పేర్కొన్నారు.
- మోటార్ల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టం: ముషారఫ్ అలీ
రైతు డిస్కంపై సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు. వ్యవసాయ మోటార్ల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు. కొందరు రైతుల పేరిట కరెంట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని అడ్డుకునేందుకు రైతు డిస్కం ఏర్పాటును ప్రతిపాదిస్తున్నట్టు వివరించారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మహారాష్ట్ర, హర్యానాలో కూడా ఇదే విధమైన డిస్కంలను ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వాలు ముందుకొచ్చినట్టు తెలిపారు.
రాష్ట్రంలోని సదరన్, నార్తర్న్ డిస్కంలతో కలిసి రైతు డిస్కం పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం రెండు డిస్కంల నుంచి 2 వేల మంది ఉద్యోగులను తీసుకున్నామన్నారు. అందులో ఇంజినీర్లు 660, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ స్టాఫ్, ఆర్టిజన్లు వెయ్యి మంది, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ 340 మంది ఉన్నారని తెలిపారు. ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే రైతు డిస్కంను స్వాగతిస్తున్నామన్నారు.
ఈ కొత్త డిస్కంను ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. తమ నుంచి రైతు డిస్కం ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు మంచి, మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దీనికోసం అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు.
- మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం..
బీఆర్ఎస్ తరఫున హాజరైన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘‘సీఎండీ ముషారఫ్ రైతుల పేరు మీద ఎవరో దొంగతనం చేస్తున్నట్టు మాట్లాడరని, ఎక్కడ కరెంట్ దొంగతనం జరుగుతున్నదో తెలుసుకో వచ్చు కదా?’’ అన్నారు. అక్కడే ఉన్న ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ అద్దంకి దయాకర్ ఆయనను అడ్డుకున్నారు.
ఈఆర్సీ ఎదురుగా తప్పుడు ఆరోపణలు చేయవద్దన్నారు. జస్టిస్ నాగార్జున జోక్యం చేసుకొని ‘‘ముషారఫ్ ఏం చెప్పారం టే.. రైతు డిస్కం ఏర్పాటు చేసి 19% ఉన్న లాస్ తగ్గించుకుంటాం అని చెప్పారు. రైతులు దొంగలు అని ఎక్కడా అనలేదు’’ అని వివరించారు.
