
- బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి
- ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయుడు, జ్వాలాకు భూమి ఇవ్వాలి: కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. సివిల్ కోర్టు సవరణ బిల్లును సమర్థించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవని తెలిపారు. అద్దె భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరమన్నారు. నియోజకవర్గాల్లో జూనియర్ సివిల్ కోర్టులు లేవని, వెంటనే వాటి సంఖ్యను పెంచాలని కోరారు.
పబ్లిక్ సర్వీసుల నియామకంలో సవరణ బిల్లు
పబ్లిక్ సర్వీసుల నియమాకంలో సవరణ బిల్లులను సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్, ఎంఐఎం సభ్యుడు మాజీద్ హుస్సేన్, కాంగ్రెస్ సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, దానం నాగేందర్ నాగరాజు మాట్లాడారు.
కౌశిక్ రెడ్డి బిల్లును సమర్థిస్తూనే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజ్ఞాన్ ఓజా, అంబటి తిరుపతి రాయుడు, గుత్తా జ్వాల వంటి క్రీడాకారులకు స్థలం కేటాయించాలని కోరారు. ఓల్డ్ సిటీలోని స్టేడియంల పెండింగ్ పనులను పూర్తి చేయాలని, పాత స్టేడియంలను ఆధునీకరించాలని మాజీద్ హుస్సేన్ కోరారు. కాగా.. పబ్లిక్ సర్వీసుల బిల్లు సభ ఆమోదం పొందిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్ బాబు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ, ఎంఐఎం సభ్యులు మాట్లాడారు. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్రానికి లబ్ధి కలిగించే విషయాల్లో అందరం కలిసి పనిచేద్దామని సూచించారు. అత్యాచారాలు, సైబర్ క్రైం, ఫాస్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలన్నారు. అగ్రికల్చర్ వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని, దాన్ని వేరే ప్రాంతానికి తరలిచాలని కోరారు.
బిల్లును స్వాగతిస్తున్నాం: కూనంనేని
సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఆమోదం తెలిపారు. దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ కొట్టుమిట్టాడుతోందని, ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చేసేందుకు అనుమతి అడిగితే పోలీసులు నిరాకరిస్తున్నారని, పోలీసు శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఉపా వంటి చట్టాలను కేంద్రం యథేచ్ఛగా అమలు చేస్తోందని, ఆ చట్టాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలువరించాలని కోరారు.