అల్వాల్ లో అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ లభ్యం

అల్వాల్ లో అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ లభ్యం

అల్వాల్ లో అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ లభించడంలో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వెస్ట్ వెంకటాపురంలోని రోజరీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని(15) యధావిధిగాస్కూల్ కి వెళ్లింది.  సమయానికి విద్యార్థిని తండ్రి ఆమెను పాఠశాల వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో స్కూల్ టీచర్ సదరు విద్యార్థిని ప్రాజెక్టు వర్క్ చేయలేదన్న నెపంతో మందలించింది. ఇంటి దగ్గర పుస్తకాలు మర్చిపోయానని తిరిగి తీసుకొస్తానని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత సదరు విద్యార్థిని తండ్రి మధ్యాహ్నం లంచ్ బాక్స్  తీసుకొని పాఠశాలకు రాగా తమ కూతురు కనిపించలేదు. దీంతో పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించగా ప్రాజెక్టు పుస్తకాల కొరకు పాఠశాల నుంచి ఉదయం 11 గంటలకు ఇంటికి వెళ్లిందంటూ సమాధానం చెప్పారు. తండ్రి ఇంటికి ఫోన్ చేయగా కూతురు రాలేదని భార్య సమాధానం చెప్పింది. పాఠశాల పరిసర ప్రాంతాలతో పాటుగా చుట్టుపక్కల ఎంత వెతికినా విద్యార్థిని ఆచూకి లభించలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులతో పాటుగా పాఠశాల నిర్వాహకులు, బంధుమిత్రులు, స్థానికులు పాఠశాల పరిసర ప్రాంతాలలో వెతకడం ప్రారంభించార. చివరగా సాయంత్రం 6గంటల ప్రాంతంలో విద్యార్థినిని వెస్ట్ వెంకటాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తించారు. 

ఏది ఏమైనప్పటికీ పాఠశాలకు వచ్చిన విద్యార్థినికి సంబంధించి పాఠశాల నిర్వాహకులు వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇట్టి విషయమై విద్యార్థుల తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థుల పట్ల ఇంత అజాగ్రత్తగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. మరో వైపు పాఠశాల యాజమాన్యం మాత్రం ప్రాజెక్టు వర్క్ కు సంబంధించి పుస్తకాలను తీసుకువచ్చేందుకే పాఠశాల నుంచి విద్యార్థిని ఇంటికెళ్లేందుకు అనుమతిచ్చామని చెబుతున్నారు