తెలంగాణలో ఇటీవల కాలంలో అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తహశీల్దార్ ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు ఎక్కడ చూసినా ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీరు టీవీల్లో, సోషల్ మీడియాలో చూసినప్పుడు.. టేబుల్‌పై డబ్బు నోట్లతో పాటు చిన్న చిన్న గాజు సీసాలలో 'పింక్ కలర్' ద్రవం లైన్‌గా అమర్చి ఉండటాన్ని ఖచ్చితంగా గమనించే ఉంటారు. చూడటానికి ఏదో సాఫ్ట్ డ్రింక్ లా ఉండే ఆ గులాబీ రంగు సీసాలే.. సదరు అవినీతి అధికారి జైలుకు వెళ్లడానికి బలమైన సైంటిఫిక్ సాక్ష్యాలని మనలో చాలా మందికి తెలియదు.
సాధారణంగా మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు అని అంటుంటాం. కానీ భారతీయ అవినీతి నిరోధక చట్టంలో ఇది కేవలం ఒక సామెత కాదు. ఒక నిజమైన కెమికల్ రియాక్షన్. అవినీతి తిమింగలాలకు పీడకల అయిన ఆ పింక్ బాటిల్స్ వెనుక ఉన్న క్రేజీ స్టోరీ ఇదీ..
ఈ మొత్తం ఆపరేషన్‌లో అసలైన హీరో 'ఫినాల్ఫ్తలీన్' అనే ఒక కెమికల్. సుమారు 150 ఏళ్ల క్రితం జర్మన్ శాస్త్రవేత్త కనుగొన్న ఈ తెల్లటి పౌడర్.. ఒక అద్భుతమైన యాసిడ్-బేస్ ఇండికేటర్. అంటే ఇది మామూలుగా చూస్తే టాల్కమ్ పౌడర్ లా తెల్లగా ఉంటుంది. అయితే ఏదైనా ఆల్కలిన్ సొల్యూషన్ తగిలితే చాలు క్షణంలో ముదురు గులాబీ రంగులోకి మారిపోతుంది.
ఏసీబీ అధికారులు దాడికి వెళ్లే ముందు స్వతంత్ర సాక్షుల సమక్షంలో లంచంగా ఇవ్వబోయే కరెన్సీ నోట్ల నంబర్లను నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ నోట్లపై ఈ ఫినాల్ఫ్తలీన్ పౌడర్‌ను ఎవరికీ కనిపించకుండా రాస్తారు. బాధితుడు ఆ నోట్లను అవినీతి అధికారికి చేతికి ఇవ్వగానే.. ఆ పొడి కాస్తా ఆ అధికారి చేతి వేళ్లకు, అరచేతికి అంటుకుంటుంది.
ALSO READ : తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు
సరిగ్గా డబ్బులు చేతులు మారగానే ఏసీబీ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఆ అధికారిని చేతులు కడుక్కోకుండా అడ్డుకుని ఒక గాజు గ్లాసులో సోడియం కార్బోనేట్(వాషింగ్ సోడా) కలిపిన స్వచ్ఛమైన నీటిని తీసుకుంటారు. అందులో నిందితుడి చేతులను ముంచమని చెప్తారు. అంతే ఒక మ్యాజిక్ లాగా ఆ తెల్లటి నీరు కాస్తా క్షణాల్లో ముదురు పింక్ కలర్‌లోకి మారిపోతుంది. చేతికి ఉన్న ఫినాల్ఫ్తలీన్ పొడి.. సోడియం కార్బోనేట్ ద్రావణంలో కరగడం వల్లే ఈ కలర్ చేంజ్ జరుగుతుంది. కోర్టులో "ఈ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎవరో నా టేబుల్ పై పెట్టారు" అని అధికారులు తప్పించుకోకుండా ఉండటానికి ఈ పింక్ కలర్ నీరే కోర్టులో తిరుగులేని సాక్ష్యం లా పనిచేస్తుంది. ఈ నీటిని పారబోయకుండా స్టెరైల్ గాజు సీసాలలో నింపి, సీల్ చేసి, సాక్షుల సంతకాలతో కోర్టుకు పంపుతారు.
కాలం మారడంతో అవినీతి అధికారులు కూడా రూట్ మార్చారు. ఈ పింక్ వాటర్ టెస్ట్ నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చాలామంది డబ్బును నేరుగా చేత్తో తాకడం లేదు. ఆ ఫైల్‌లో పెట్టండి, ఆ డ్రాయర్‌లో వేయండి అని చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఏసీబీ అధికారులు సదరు అధికారి షర్ట్ జేబు లోపలి భాగాన్నో, ఆ డ్రాయర్ ఉపరితలాన్నో సోడా నీటితో కడిగి ఆ పింక్ ట్రేస్‌ను పట్టుకుంటున్నారు. మరికొందరైతే మధ్యవర్తులను వాడుకుంటున్నారు దొరక్కుండా ఉండేందుకు. అయినా సరే ఏసీబీ ఈ కెమికల్ అస్త్రాన్ని ప్రయోగించి అవినీతి తిమింగలాల ఆట కట్టిస్తూనే ఉంది.
