డీవీఏ స్కూల్ ఘటన నిందితుడికి సఫిల్ గూడ బ్రాంచ్​ ప్రిన్సిపల్ మద్దతు

డీవీఏ స్కూల్ ఘటన నిందితుడికి సఫిల్ గూడ బ్రాంచ్​ ప్రిన్సిపల్ మద్దతు
  • డీఏవీ స్కూల్ సఫిల్ గూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ వ్యాఖ్యలు
  • పేరెంట్స్ ఆందోళన.. ప్రిన్సిపల్ పార్తిపన్ అరెస్ట్ 

నేరెడ్​మెట్, వెలుగు: హైదరాబాద్ లోని బంజారాహిల్స్​ డీవీఏ పబ్లిక్ స్కూల్  లో చిన్నారిపై జరిగిన లైంగిక దాడిలో నిందితుడికి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సఫిల్ గూడ బ్రాంచ్​ ప్రిన్సిపల్ పార్తిపన్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. గురువారం సఫిల్ గూడలోని డీఏవీ పబ్లిక్ ​స్కూల్ బ్రాంచ్ లో పేరెంట్స్​ మీటింగ్​ నిర్వహించారు. చిన్నారిపై జరిగిన లైంగిక దాడి చిన్నదే కదా అంటూ నిందితుడు రజనీకుమార్ కు మద్దతుగా  ప్రిన్సిపల్​ పార్తిపన్ మాట్లాడడంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయనను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

వివిధ పార్టీల నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రిన్సిపల్ పై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న నేరెడ్​మెట్​ పోలీసులు స్కూల్​ దగ్గరికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని కంట్రోల్ చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య పార్తిపన్ ను అరెస్ట్ చేశారు. డీవీఏ స్కూల్ మేనేజర్ శేషాద్రి నాయుడు మాట్లాడుతూ.. సఫిల్ గూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని బ్రాంచిలలో లోపాలను సరిదిద్దిన తర్వాత, పేరెంట్స్ తో చర్చించి, స్కూళ్లను రీఓపెన్ చేస్తామన్నారు.