దోస్తులను దొంగతనానికి పంపిన యువకుడు

దోస్తులను దొంగతనానికి పంపిన యువకుడు

ఎల్ బీ నగర్,వెలుగు: బంధువు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారాన్ని కొట్టేసేందుకు ఓ యువకుడు స్కెచ్ వేశాడు. తన బర్త్ డే ఉందంటూ బంధువు కుటుంబసభ్యులను పిలిచి.. తన దోస్తులను అతడి ఇంట్లో చోరీకి పంపించాడు. మీర్ పేటలో గత నెల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. వరుసకు అల్లుడయ్యే యువకుడే చోరీకి కారణమని తేల్చి అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను శనివారం ఎల్​బీనగర్​లోని రాచకొండ క్యాంప్ ఆఫీసులో ఎల్​బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ వెల్లడించారు. మీర్​పేటలోని షరీఫ్ నగర్ కాలనీలో ఉండే మహ్మద్ అలీకి సైదాబాద్ లోని మాదన్నపేటకు చెందిన యాసర్ ఉల్లీమన్(19) వరుసకు అల్లుడు అవుతాడు. యాసర్ అప్పుడప్పుడు మీర్ పేటలోని అలీ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. 

ఈ క్రమంలో అలీ ఇంట్లోని విలువైన వస్తువులు, బంగారు నగలను చూసి వాటిని కొట్టేసేందుకు యాసర్ స్కెచ్ వేశాడు. ఈ విషయాన్ని సైదాబాద్​కు చెందిన తన ఫ్రెండ్స్ అష్ఫక్(19), అయాజ్(19)కు చెప్పాడు. గత నెల 31న తన బర్త్ డే ఫంక్షన్ ఉందని.. సైదాబాద్​కు రావాలని మామ అలీకి యాసర్ చెప్పాడు. మహ్మద్ అలీ తన ఫ్యామిలీతో కలిసి 31న సాయంత్రం యాసర్ బర్త్ డే ఫంక్షన్​కు వెళ్లాడు. వెంటనే యాసర్ తన ఫ్రెండ్స్ కు కాల్ చేసి ముందస్తు ప్లాన్ ప్రకారం అలీ ఇంట్లో చోరీకి వెళ్లమని చెప్పాడు. అష్ఫక్, అయాజ్ ఇద్దరు మీర్ పేటలోని అలీ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి 40 తులాల బంగారు నగలు, విలువైన హ్యాండ్ వాచ్​లు, డాలర్లు, వెండి సామగ్రి, వస్తువులు ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి ఫంక్షన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన అలీ చోరీ జరిగినట్లు గుర్తించి  మీర్ పేట పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

పోలీసులను డైవర్ట్ చేసేందుకు వేషం మార్చి..
చోరీ తర్వాత అష్ఫక్, అయాజ్ పోలీసులను డైవర్ట్ చేసేందుకు ప్లాన్ వేశారు. అష్ఫక్ బురఖా వేసుకుని, అయాజ్ మంకీ క్యాప్ పెట్టుకుని బైక్ పై పరారయ్యారు. ఇదంతా దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టి వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. మహ్మద్ అలీ అల్లుడు యాసర్ ఉల్లీమన్ చోరీకి స్కెచ్ వేసినట్లు విచారణలో నిందితులు చెప్పారు. యాసర్​తో పాటు చోరీకి పాల్పడ్డ అతడి ఫ్రెండ్స్ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.33 లక్షల విలువైన 36 తులాల బంగారు నగలు, డాలర్స్, విలువైన వాచ్​లు, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపారు.