- అసత్య ప్రచారాలు నమ్మకండి
- అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గ్రామాల ప్రజలు
పంజాగుట్ట, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియా నుంచి తాము ఎవరి ఒత్తిడి లేకుండానే స్వచ్ఛందంగా పునరావాస ప్రాంతాలకు వెళ్తున్నామని, తమపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పునరావాస కమిటీ సభ్యులు మాట్లాడారు. ఏండ్ల తరబడి అడవుల్లో, కొండల్లో కనీస సౌకర్యాలు లేక, క్రూర మృగాల భయంతో నానా ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
పునరావాసం ద్వారా బయట ప్రాంతాలకు వెళ్తేనే తమ బతుకులు బాగుపడతాయని, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు తమకు అన్ని వసతులు కల్పించారని తెలిపారు. సుద్దపల్లి, కుడి చింతల బైలు, తాటి గుండల పెంట, కొల్లం పెంట, వటవార్లపల్లి గ్రామాల నుంచి సుమారు 1,088 కుటుంబాలు మెరుగైన జీవితం కోసం బాచారం ప్రాంతానికి వెళ్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాయిబాబ, వెంకటేష్, సంతోష్ కుమార్, మల్లికార్జున్, బయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
