ఆఫీసర్‌పై పెట్రోల్​ పోసి నిప్పంటించిన సర్పంచ్

ఆఫీసర్‌పై పెట్రోల్​ పోసి నిప్పంటించిన సర్పంచ్
  • బిల్లులు అప్రూవ్​ చేయట్లేదని సర్పంచ్​ దారుణం
  • రికార్డులు తగలబెడుతుండగా.. గాయాలయ్యాయన్న సర్పంచ్ 
  • కావాలనే పెట్రోల్ ​పోశాడంటున్న బాధితుడు

కుభీరు/భైంసా వెలుగు: బకాయి బిల్లులపై సంతకం చేయడం లేదంటూ.. ఓ సర్పంచ్ ఉపాధి హామీ పథకం టెక్నికల్​అసిస్టెంట్​పై పెట్రోల్​పోసి నిప్పంటించాడు. ఈ ఘటన నిర్మల్​ జిల్లా కుభీర్ మండలంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కుభీర్ మండలంలో రావుల రాజు ఉపాధి హామీ టెక్నికల్​అసిస్టెంట్​గా పనిచేస్తున్నాడు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు చేయిస్తూ.. వాటికి బిల్లులు వచ్చేలా చూడటం ఆయన డ్యూటీ.  మండలంలోని ఓల్డ్ సావ్లి గ్రామ సర్పంచ్ సాయినాథ్ కు రాజుకు మధ్య మస్టర్​బకాయి బిల్లులకు సంబంధించి వివాదం నడుస్తోంది. 

మంగళవారం రాజు మండల ఆఫీస్​లో డ్యూటీలో ఉండగా.. సాయినాథ్ పెట్రోల్ డబ్బాతో అక్కడికి చేరుకున్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సర్పంచ్ తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను రాజు పై పోసి నిప్పంటించి, పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. ఈ ప్రమాదంలో మంటలు అంటుకొని రాజుకు 35 శాతం గాయాలయ్యాయి. అతడిని వెంటనే  భైంసాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. ఈ ఘటనపై వారి వివరణ కోరగా..  ‘సర్పంచ్ సాయినాథ్ రోడ్డు గ్రావెల్ బిల్లుల విషయంలో పగ పెంచుకున్నాడు. కావాలనే నా పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు’ అని రాజు తెలుపగా.. ‘ మా గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో టీఏ రాజు ఇబ్బంది పెట్టాడు. ఇది విసిగిపోయి పెండింగ్ బిల్లుల ఫైల్స్ కు నిప్పంటించబోయా.. అక్కడే ఉన్న రాజు పై పెట్రోల్ పడి గాయాలయ్యాయి.. నేను కావాలని చేయలేదు’ అని సర్పంచ్​ సాయినాథ్​అంటున్నాడు.  రాజు పై జరిగిన పెట్రోల్ దాడి విషయంపై దర్యాప్తు చేస్తున్నామని భైంసా రూరల్​సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. చికిత్స పొందుతున్న రాజును జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు.