పబ్లిక్ గార్డెన్స్​లో అవతరణ  వేడుకలు

పబ్లిక్ గార్డెన్స్​లో అవతరణ  వేడుకలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేసింది. వేడుకలకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ ముస్తాబైంది. కరోనా కారణంగా గత రెండేళ్ల పాటు ఉత్సవాలను  ప్రగతి భవన్ లోనే నామమాత్రంగా నిర్వ హించారు. సీఎం కేసీఆర్ అక్కడే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సారి పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు సీఎం జాతీయ జెండాను ఎగురవేస్తారు. అంతకంటే ముందు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ కు చేరుకుని పోలీస్ దళాల గౌరవవందనం స్వీకరిస్తారు. జెండా ఎగురవేశాక సీఎం మాట్లాడతారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా వేటికవే తమ పార్టీ ఆఫీసుల్లో వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా, అధికారికంగా ఢిల్లీలో రాష్ట్రావతరణ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్రావతరణ దినోత్స వాన్ని పురస్కరించుకుని సాయంత్రం రవీంద్ర భారతిలో 30 మంది ప్రముఖ కవులతో కవి సమ్మేళనాన్ని కూడా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.