ప్రతిపక్షనాయకులపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిఘా

ప్రతిపక్షనాయకులపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిఘా
  • ఎవరు ఎక్కడికి వెళ్లినా ఎప్పటికప్పుడు సమాచార సేకరణ
  • బండి సంజయ్, వివేక్​, రాజగోపాల్, ఈటల, రేవంత్​పై ప్రధాన ఫోకస్​
  • ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల ఇండ్ల చుట్టూ రాష్ట్ర ఇంటెలిజెన్స్
  • ప్రతిపక్ష నేతల కదలికలపై ఇంటెలిజెన్స్​తో రాష్ట్ర సర్కార్​ ఆరా

న్యూఢిల్లీ, వెలుగు: పొలిటికల్ హీట్ పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం.. నిఘాను తీవ్రతరం చేసింది. రాజకీయంగా తమను దెబ్బతీసే అవకాశమున్న ప్రతిపక్ష నేతలందరిపై ఇంటెలిజెన్స్ తో కన్నేసి పెట్టింది. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేత‌‌ల కదలికలతో పాటు నివాసాలు, వాళ్లకున్న ఆఫీసులపైనా ప్రధానంగా ఫోకస్​ పెట్టింది. రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్​కు వరుసగా ఉప ఎన్నికలు షాకిచ్చాయి. గతంతో పోలిస్తే సొంత పార్టీ నేతల వలసలు, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవటం టీఆర్​ఎస్​ను ఆందోళనకు గురిచేస్తున్నది. అందుకే ఇతర పార్టీల నేతల కదలికలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్​ను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో.. ఢిల్లీలోనూ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిఘా ఏర్పాట్లు చేసుకుంది. బీజేపీలో లీడర్ల చేరికలపై కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్య నేతలందరి టూర్లను సీఎం కేసీఆర్​ ఎప్పటికప్పుడు ఆరా తీయిస్తున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, నడ్డా, భూపేందర్ యాదవ్ ఇంటి చుట్టూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి బయలుదేరారు..? వారితో ఎవరెవరు ఉన్నారు..? ఢిల్లీలో ఎవర్ని కలుస్తున్నారు..? వంటి వివరాలన్నీ ఇంటెలిజెన్స్​ సాయంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ముఖ్య నేతలైన బండి సంజయ్​, వివేక్​ వెంకటస్వామి, రాజగోపాల్​రెడ్డి, ఈటల రాజేందర్​తో పాటు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కదలికలను ప్రధానంగా వాచ్​ చేస్తున్నారు. ‘వీ6 వెలుగు’తో పాటు పలు మీడియా సంస్థల ఆఫీసుల వద్ద ఇంటెలిజెన్స్​ సిబ్బందికి డెయిలీ డ్యూటీ అప్పగించారు. ఆఫీసులకు ఎవరెవరు వస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు.. ఎంతసేపు చర్చలు జరుపుతున్నారనే వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఏడున్నరేండ్లుగా ఢిల్లీలో తెలంగాణ ఇంటెలిజెన్స్ టీం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం మాత్రం 2 టీమ్​లతో నిఘా కొనసాగిస్తున్నది. 2 టీమ్​లను 15 రోజుల చొప్పున ఢిల్లీలో ఉంచుతున్నది. తెలంగాణ సర్కార్ మాత్రం ఏడున్నరేండ్ల తర్వాత నిఘా పెట్టింది. ఇందుకు పర్మినెంట్ టీంలను పెట్టకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న ఇంటెలిజెన్స్ సిబ్బందికి డ్యూటీలు వేస్తున్నది. ఒక సీఐని టీమ్​కు ఇన్​చార్జ్​గా నియమించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే ప్రతిపక్ష నేతలను వాచ్ చేయడం, వారి ఢిల్లీ టూర్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఇవ్వడం టీమ్​ పని. బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లు  ఎయిర్ పోర్ట్​లో దిగిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు కాపలా కాస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ల ఇండ్ల చుట్టూ పడిగాపులు కాస్తూ... సమాచారం సేకరిస్తున్నారు.  కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇండ్లను కూడా వీరు వాచ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ విషయం ఇంటెలిజెన్స్​ వర్గాలే కేసీఆర్​కు చేరవేసినట్లు టీఆర్​ఎస్ లీడర్లు చెప్తున్నారు. 

ఫోన్​ కాల్స్​ ట్యాపింగ్​ను తప్పించుకోవడంతో..!

రాష్ట్రంలో కొన్నేండ్ల నుంచి ఫోన్ల ట్యాపింగ్​పై చర్చ జరుగుతున్నది. అప్పటినుంచీ పొలిటికల్​ లీడర్లు ఫోన్​ కాల్స్​ కాకుండా.. వాట్సాప్​ కాల్స్​, తమ డేటాను రహస్యంగా ఉంచే ఇతర యాప్​లను వాడుతున్నారు. టెక్నాలజీకి చిక్కకుండా రహస్య  మంతనాలు జరుపుతున్నారు. అవన్నీ తమను దెబ్బతీస్తాయనే అనుమానంతో టీఆర్​ఎస్​ ఇప్పుడు రూట్​ మార్చింది. అటు కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ సేవలతో పాటు ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఫోకస్​ పెట్టింది. ఫోన్​ కాల్స్​ ట్యాపింగ్​ ద్వారా నిఘా పెడుతున్నా.. దాన్ని తప్పించుకుంటున్నారని భౌతిక నిఘాను ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఇంటెలిజెన్స్​ సిబ్బందిని మోహరించింది. టీఆర్ఎస్​లో ఏక్​నాథ్​ షిండేలు ఉన్నారని, ఏకంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జరగడంతో  సొంత పార్టీ నేతలపై కూడా నిఘా పెట్టారు. ఉద్యమంలో తమ వెంట నడిచిన నేతలు ఇప్పుడు ఎవర్ని కలుస్తున్నారనే అంశంపైనా కూపీ లాగుతున్నారు.