ధాన్యానికి రూ.1960 మద్దతు ధర ఇవ్వాల్సిందే

ధాన్యానికి రూ.1960 మద్దతు ధర ఇవ్వాల్సిందే
  • ప్రతి గింజను కొనాల్సిందే
  • ప్రాజెక్టుల కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు
  • నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

నల్లగొండ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల కమీషన్ల మీద వున్న శ్రద్ధ.. రైతుల మీద లేదని ఆయన విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను 1960 రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
ఆదివారం నల్గొండ పట్టణంలోని బత్తాయి మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఫోన్ చేశారు. రైతులు 16 రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చినా ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంపై నిలదీశారు. వ్యవసాయం చేసే వారిలో అత్యధికంగా వరి పండించే రైతులు ఉంటే.. వరి కొనుగోలు చేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని, పైగా రైతులు వరి వేసుకోవద్దని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఈవిషయంలో తాము రైతుల పక్షాన నిలబడతామని, మీరు వరి వేసుకోండి, అవసరమైతే రైతుల పక్షాన ఉద్యమాలు చేస్తామని భరోసా ఇచ్చారు. పంటభీమా పథకం దేశ వ్యాప్తంగా ఉంది, కేవలం తెలంగాణ రాష్ట్రంలో లేదు, రుణమాఫీ లేదు, క్రాఫ్ ఇన్సూరెన్స్ లేదు, రెండు లక్షల కోట్ల బడ్జెట్ ను మీరు ఏం చేస్తున్నారు? అన్నదాత పండించిన ధాన్యం కొనుగోలు చేయలేరా...?  ఈ దేశానికి భారత ప్రభుత్వం ఏది చెబితే అది ఫైనల్, ధాన్యం మొత్తం 1960 మద్దతు ధర కు కొనాలని చెప్పింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు విషయంలో రైతులని ఇబ్బందులు పెడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.