అప్పులు తెచ్చుడు వడ్డీలు కట్టుడు.. ఆరేండ్లలో మిత్తీలకే రూ.56 వేల కోట్లు

అప్పులు తెచ్చుడు వడ్డీలు కట్టుడు.. ఆరేండ్లలో మిత్తీలకే రూ.56 వేల కోట్లు
  • ప్రతి నెలా కడుతున్నది రూ.1,220 కోట్ల పైనే..
  • రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నెలకు రూ.432 కోట్లు
  • ఇప్పుడు అప్పులపై వడ్డీ మూడింతలైంది
  • ట్యాక్స్ల ద్వారా వచ్చే ఆదాయంలో 23 శాతం మిత్తీలకే
  • గత ఐదు నెలల్లో 25 వేల కోట్ల అప్పు చేసిన సర్కారు
  • అడ్డగోలు అప్పులు మంచిది కాదంటున్న ఎక్స్పర్టులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి అప్పులు పెరిగిపోతున్నాయి.. ఆ అప్పులకు వడ్డీలు ఎక్కువవుతున్నాయి. ఏటా మిత్తీలు కట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల సగటున రూ.1,220 కోట్ల వడ్డీలను సర్కారు చెల్లిస్తోంది. గతేడాదితో పోల్చితే ఇది 11 శాతం ఎక్కువ. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రభుత్వం ప్రతి నెల రూ.432 కోట్ల వడ్డీ చెల్లించేది. ప్రస్తుతం మిత్తీల చెల్లింపు మూడింతలు పెరిగిపోయింది. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం దాదాపు రూ.56 వేల కోట్ల వడ్డీలు కట్టింది. ప్రతి నెల రాష్ట్రానికి వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో వడ్డీల చెల్లింపు కోసమే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తోంది. అపరిమితమైన అప్పులు భవిష్యత్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఎక్స్పర్టులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఆరేండ్లలో వడ్డీల కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు… ఒక ఏడాది రాష్ట్ర ఆదాయంలో సగం అని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం ఏటా అప్పులను విపరీతంగా చేస్తుండటంతో వడ్డీల భారం అంతే స్థాయిలో పెరిగిపోతోంది. ప్రతి నెల ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో వడ్డీలు కట్టేందుకే ఎక్కువ శాతం ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి రూ.25,199 కోట్ల పన్ను ఆదాయం వస్తే ఇందులో వడ్డీ చెల్లింపుల కోసం రూ.5,796 కోట్లు (సుమారు 23 శాతం) ఖర్చు చేసింది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ రుణ పరిమితిని కేంద్రం పెంచింది. దీంతో అదనంగా రూ.12 వేల కోట్లు అప్పు తీసుకునే వెసులుబాటు పెరగడంతో వడ్డీల చెల్లింపు భారం ప్రతి నెల అదనంగా వంద కోట్లు పెరగనుంది.ఐదు నెలల్లో 25 వేల కోట్ల అప్పుఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి ప్రభుత్వం దాదాపు 25 వేల కోట్ల అప్పు చేసింది. ఈ విషయాన్ని కాగ్ విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. గతేడాది చేసిన అప్పు కంటే ఇది 26 శాతం అధికం.

ఇట్లయితే కష్టమే..

ఏటా వడ్డీ చెల్లింపు భారం పెరిగితే భవిష్యత్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉందని ఎకనమిక్ ఎక్స్పర్టులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర నికర ఆదాయంలో అప్పులు, వడ్డీల చెల్లింపు కోసం 20 శాతం మించకూడదని అంటున్నారు. రాష్ట్రంలో వడ్డీల కోసం చేసే చెల్లింపులు ఏప్రిల్ నెలలో రాబడిలో ఏకంగా 60 శాతం దాటాయని, ఇది మంచిది కాదని చెప్తున్నారు. 2020 ఏప్రిల్లో కాగ్ విడుదల చేసిన రిపోర్టులో రాష్ట్రానికి వస్తున్న సొంత పన్నుల ఆదాయం, కేంద్ర పన్నుల వాటా రూ.1,700 కోట్లు ఉంటే, వడ్డీల కోసం చెల్లింపులు రూ.1,109 కోట్లు ఉండటం ఆందోళన కలిగించే విషయం అని అంటున్నారు.