వాట్ నెక్స్ట్.. ‘కాళేశ్వరం’ఎవరికి శనేశ్వరమో?

వాట్ నెక్స్ట్.. ‘కాళేశ్వరం’ఎవరికి శనేశ్వరమో?
  • వాట్ నెక్స్ట్
  • ‘కాళేశ్వరం’ఎవరికి శనేశ్వరమో?
  • దూకుడు పెంచిన ప్రభుత్వం
  • విచారణ చేయాలన్న బీఆర్ఎస్ 
  • ఈ నెల 29న మేడిగడ్డకు మంత్రులు
  • అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్
  • నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సబ్ కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సర్కారు దూకుడు పెంచింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగింది. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే రివ్యూలు చేస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మరమ్మతులకు తమ బాధ్యత లేదన్న ఎల్ అండ్ టీ ప్రతినిధులకు వార్నింగ్  ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్బంగా కాళేశ్వరం పరిశీలనకు మంత్రులు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకెళ్లనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

శాసన మండలి వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నెల 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ వద్దే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహిత, కాళేశ్వరం  ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం కట్టడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు వివరాలను ప్రజలకు వివరించనున్నారు. 

ప్రాజెక్టు నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు, దానికి అయ్యే వ్యయం ఎంత..? ఈ లెక్కన ఎకరా నీరు పారించేందుకు ఎంత ఖర్చవుతుంది..? కాళేశ్వరం కట్టడం వల్ల ఎవరికి లాభం జరిగింది. అక్కడే ఎందుకు కట్టారు. తదితర అంశాలను విడమర్చి చెప్పనున్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించి వాటిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటన కు సంబంధించి నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి హాజరయ్యేలా చూడాలని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎన్సీని ఆదేశించారు. 

అవినీతి బయటపెడ్తారా?  

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని ప్రభుత్వం బయటపెట్టి ఇందుకు కారణమైన అధికారులపై, నిర్మాణ సంస్థలపై, వెనుక ఉండి నడిపించిన అప్పటి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటుందా..? ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్​ హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా..?ఎవరిని బాధ్యులు చేస్తారు..? అన్నది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఎల్ఎండీ నుంచి నీటివిడుదలపై స్పందించిన ఇరిగేషన్ అధికారులు.. కాళేశ్వరం ప్రాజెక్టు  నీళ్లు వాడే  పరిస్థితి లేదని, మరమ్మతులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ తరుణంలో నిర్వహించే ఈ సమీక్ష, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రభుత్వం ఏం తేల్చబోతోందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.